నటుడిగా ఎంత గొప్ప పేరు సంపాదంచుకున్నా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం నవాజుద్దిన్ సిద్దిఖీపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అతని భార్య అలియా తాజాగా అతనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమని ఇంట్లో నుంచి గెంటేశాడు అని ఆరోపించింది.
నవాజుద్దిన్ సిద్దిఖీ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటులలో ఈయన కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటనలో సహజత్వం, పాత్రలను ఎన్నుకునే తీరు అందరినీ మెప్పిస్తుంది. నటుడిగా ఇండస్ట్రీలో నిలబడటమే కాకుండా నెగ్గుకొస్తున్నాడు. కానీ, ఇంట మాత్రం వివిధ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అతనిపై భార్య పలు ఆరోపణలు చేసింది. ఇటీవలే అత్యాచార కేసు కూడా పెట్టింది. నవాజుద్దిన్- అత్త తనను వేధిస్తున్నారంటూ ఆరోపించింది. తాజాగా నవాజుద్దిన్ తనని, పిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేసినట్లు భార్య ఆరోపించింది.
నవాజుద్దిన్ సిద్దిఖీ అతని భార్య అలియా మధ్య సఖ్యత లేదని అందరికీ తెలిసిందే. వాళ్లు రెండేళ్ల క్రితమే విడాకుల వరకు వెళ్లారు. కానీ, తిరిగి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తిరిగి కలిసి జీవించాలనుకున్నారు. కానీ, గత కొద్ది నెలలుగా మళ్లీ వారి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. నవాజుద్దిన్, అతని తల్లిపై భార్య అలియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరూ హృదయం లేని వ్యక్తులని తనని వేధింపులకు గురి చేశారని విమర్శించింది. ఇప్పుడు తన పిల్లల్ని తనకు కాకుండా చేయాలని చూస్తున్నట్లు ఆరోపించింది. పిల్లలపై ఎలాంటి మమకారం లేకపోయినా తనని ఒంటరిని చేయాలనే ఇలా చేస్తున్నట్లు విమర్శించింది. అతనిపై అత్యాచారం కేసు కూడా ఫైల్ చేసినట్లు వెల్లడించింది.
తాజాగా అలియా మరికొన్ని ఆరోపణలు గుప్పించింది. నవాజుద్దిన్ సిద్దిఖీ బంగ్లా ముందు పిల్లలతో కలిసి నిల్చొని ఓ వీడియో పోస్ట్ చేసింది. అర్ధరాత్రి సమయంలో తనని- పిల్లల్ని బంగ్లాలో నుంచి గెంటేసినట్లు ఆరోపించింది. తమకు ఆ ఇంట్లో చోటు లేదని నవాజుద్దిన్ సిద్దిఖీ వ్యాఖ్యానించాడని తెలిపింది. ఆ సమయంలో తనకి ఎక్కడికి వెళ్లాలనే విషయం తెలియడం లేదని, తన వద్ద రూ.80 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. తమని అలా రోడ్డుపై నిల్చోబెట్టే సరికి పిల్లలు భయాందోళనకు గురయ్యారంది. కుమార్తె రోడ్డుపై నిల్చుని ఏడుస్తూ కనిపించింది. తన దృష్టిలో నవాజుద్దిన్ స్థాయి మరింత దిగజారిపోయినట్లు అలియా సిద్దిఖీ వ్యాఖ్యానించింది. ఈ ఘనటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.