ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టాలు మొదలయ్యాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా వేసుకున్నాయి. నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కరోనాను సైతం తట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 50 కోట్లను రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోందీ చిత్రం. ఇక బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో విజయోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఇది చదవండి : లెక్చరర్ టు మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్.. సత్తా చాటిన శ్రీకాకుళం మహిళ
రాజమండ్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్ , నటుడు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా భయపడుతున్నా.. ఉత్తరాదిలో చిత్రాల విడుదల ఆపేసినా.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి చూస్తాం.. మీకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాం అని చెప్పిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు అన్నారు. సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి అని మీరంతా మరోసారి నిరూపించారని నాగార్జున తెలిపారు. నేను వసూళ్ల గురించి మాట్లాడేందుకు రాలేదు. మీ గురించి మాట్లాడటానికే ఇక్కడికి వచ్చా. మీ ఆదరాభిమానాలు చూసినప్పుడల్లా మా నాన్నగారి కి థాంక్స్ చెప్పాలనిపిస్తుంటుందని అన్నారు.
ఈ క్రమంలో ఇటీవల జగన్‌తో సమావేశం గురించి చిరంజీవితో మాట్లాడానని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు సంతోషంగా చిరంజీవి తెలిపారని నాగార్జున వెల్లడించారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన జగన్‌కు నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై సినీ పరిశ్రమకు అన్నీ మంచి రోజులేనని చెప్పుకొచ్చారు నాగార్జున. సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతో మంది జీవిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వాళ్లిద్దరు జీవించే ఉంటారని అభిప్రాయపడ్డారు.