ఒకప్పుడు తెలుగు ఆడియెన్స్‌ను తన నటనతో అలరించారు హీరోయిన్ లయ. ఈ తెలుగందం దాదాపు దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా పరాయి భాషల హీరోయిన్స్ హవా చూపిస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భామలు ఇక్కడ బాగా రాణిస్తున్నారు. ఉత్తరాది హీరోయిన్స్ కూడా తెలుగులో మంచి అవకాశాలనే దక్కించుకుంటున్నారు. అయితే టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్‌కు అంతగా అవకాశాలు ఇవ్వడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఛాన్స్ ఇస్తే సత్తా చాటేందుకు చాలా మంది నటీమణులు సంసిద్ధంగా ఉన్నారు. ఇకపోతే, లయ.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ పదహారణాల తెలుగందం ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కుటుంబ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. దాదాపు పదేళ్ల పాటు ఇక్కడ లయ హీరోయిన్గా రాణించారు. ఒక బిజినెస్‌మన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లయ అమెరికాలో సెటిల్ అయ్యారు.
మ్యారేజ్ తర్వాతి నుంచి లయ సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే పెళ్లయిన తర్వాత తాను ఖాళీగా ఉండకుండా ఒక ఉద్యోగం చేస్తున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను వర్క్ చేసిన కంపెనీలో దిగిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియలో పోస్ట్ చేశారు లయ. ఇవి నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా హైదరాబాద్ నుంచి యూఎస్‌కు తిరిగి వెళ్లిన లయ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎప్పుడికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సందడి చేస్తున్నారు. లయ ఇప్పుడు యూఎస్‌లోని జోబి ఏవియేషన్ ఏరో స్పేస్ సంస్థలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్నారని తెలిసింది. అప్పట్లో సిల్వర్ స్క్రీన్ మీద ఒక వెలుగు వెలిగిన లయ.. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ బిజీగా మారిపోయారు.