గత కొంత కాలంగా దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అయినా ప్రస్తుతం ఆ సంఖ్య దిగి వస్తుంది. ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు కరోనా భారిన పడ్డారు.. కొంత మంది కన్నుమూశారు. ముఖ్యంగా కరోనా సినీపరిశ్రమను పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, కీర్తి సురేష్ వంటి సినీ ప్రముఖులు కొవిడ్ బారినపడి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొంతకాలంగా జయసుధ అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి ఆమె చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతలోనే ఆమెకు కరోనా సోకిందన్న వార్తతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జయసుధ తెలుగులో ఉన్న సూపర్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా జయసుధ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తమ అభిమాన నటి జయసుధ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.