సినీ ఇండస్ట్రీలో తెరవెనుక కష్టాలు లేకుండా స్టార్స్ అయినవారు ఎవరూ లేరు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎల్లప్పుడూ ఏదొక వార్త, పుకారు వినిపిస్తూనే ఉంటుంది. కెరీర్ లో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఈ మధ్యే ధైర్యంగా బయట పెడుతున్నారు నటీమణులు. ‘ఓవైపు కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా ఉంటే.. మరోవైపు లావుగా ఉన్నావ్, మరీ సన్నగా ఉన్నావ్ అంటూ అవకాశాలు చేజారిపోయేవి’ అంటోంది యువనటి ఎరికా ఫెర్నాండేజ్.
ఈ హీరోయిన్ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తెలుగులో గాలిపటం, డేగ సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు కూడా అమ్మడికి ఫేమ్ తేకపోవడంతో.. ఎరికా కెరీర్ మొదలుపెట్టిన బాలీవుడ్ వైపు అడుగులేసింది. ముంబైకి చెందిన ఎరికా.. మోడలింగ్ నుండి సీరియల్స్. తర్వాత సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను బయటపెట్టింది.ఎరికా మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బొద్దుగా ఉండే హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. నేనేమో చాలా సన్నగా ఉంటాను. కాబట్టి కాస్త బొద్దుగా కనిపించేందుకు నా బాడీకి ప్యాడ్స్ పెట్టి షూటింగ్ చేసేవారు. అలా ప్యాడ్స్ పెట్టడంతో చాలా అవమానంగా, ఇబ్బందిగా అనిపించేది. సినిమాలకు కావాల్సినట్లుగా నేను లేనేమోనని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. ఎందుకంటే.. పరిస్థితులు మారిపోయి.. అందరికీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి’ అని తన అనుభవాలను షేర్ చేసుకుంది. ఈ బ్యూటీ హిందీ, తెలుగు,తమిళంతో పాటు కన్నడ సినిమాలలో కూడా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం మోడలింగ్ చేస్తూ అడపాదడపా సినిమాల్లో మెరుస్తోంది. మరి ఈ హీరోయిన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.