Sivaji: సినీ ఇండస్ట్రీకి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న నటుడు శివాజీ.. మరోసారి సినిమా వేదికపై కనిపించారు. సినిమాలకు దూరమయ్యాక పొలిటికల్ గా బిజీ అయిన శివాజీ.. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘అల్లూరి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. “అల్లూరి అంటే మాకు సూపర్ స్టార్ కృష్ణగారు గుర్తొస్తారు. ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిల్చిన చిత్రం అది. అల్లూరి సినిమా నిర్మాత గోపి (బెక్కెం వేణుగోపాల్) చాలామందిని పరిచయం చేశారు. కానీ.. నేను గోపీని పరిచయం చేశానని చాలా ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే గోపీ సినిమా మీద సూపర్ స్టార్ క్రిష్ణగారి మీద అభిమానంతో అచ్చెంపేట నుంచి హైదరాబాద్ వచ్చారు.
ఇండస్ట్రీలో అనుకోకుండా ఓ చీకటి రోజున నన్ను కలిశాడు. నేను కూడా ఆ టైంలో చీకట్లోనే ఉన్నాను. తర్వాత ఇద్దరం చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం. గోపి నాకు ప్రతి కథ చెప్తాడు. అలా నాకు చెప్పిన కథల్లో కొన్ని వద్దన్నాను. అలా నేను వద్దని చెప్పిన ‘నేను నాన్న బాయ్ ఫ్రెండ్’ సినిమా చేశాడు.. ఆ సినిమా మిస్ ఫైర్ అయ్యింది. రీసెంట్ గా నాకు ‘అల్లూరి’ కథను చెప్పాడు. ధైర్యంగా గుండెలపై చేయి వేసుకుని ఈ సినిమా చేయొచ్చని చెప్పాను. అంత అద్భుతంగా ఈ సినిమా కథను తయారు చేశారు దర్శకుడు.
పోలీస్ కథలు చాలా వరకూ సక్సెస్ అవుతాయి. మనల్ని మనం సినిమాలో ఊహించుకుంటాం కాబట్టే.. సినిమాలు ఇంకా బతికి ఉన్నాయి.. బతికే ఉంటాయి. అల్లూరి జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇలాంటి భావనలతోనే నేను సినిమాలకు దూరం అయ్యారు. నా కెరీర్ లో చివరి సినిమా ‘బూచమ్మా బూచాడు’. నా కెరీర్ ని పాలెం బస్సు సంఘటన సినిమాలకు దూరం చేసింది.
అప్పటినుండి హ్యాపీగా నా సినిమాలు నేను చేసుకుని ఉంటే.. ఎంత వరస్ట్ సినిమాలు తీసినా.. తక్కువలో తక్కువ 10-15 కోట్లు సంపాదించేవాడ్ని. కానీ అప్పుడు నేను ఇవన్నీ ఆలోచించలేదు. ఈరోజుకు కూడా మన భారతదేశం పాలెం బస్సు దగ్గరే ఆగిపోయింది” అంటూ మాట్లాడారు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి శివాజీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.