దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ నటుడు శింబు(సిలాంబరాసన్) ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను వేల్స్ విశ్వవిద్యాలయం శింబుకి ఈ డాక్టరేట్ ని అందించినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు సినిమా రంగంతో పాటు అన్నిరంగాలలో వారి సేవలను గుర్తించి పురస్కారాలు అందిస్తుంటాయి. ఈ వేల్స్ యూనివర్సిటీ నుండి ఇదివరకు తమిళ ఇండస్ట్రీ నుండి MG రామచంద్రన్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్స్ డాక్టరేట్లను అందుకున్నారు. ఇప్పుడు వారి జాబితాలో శింబు చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఈ సందర్భంగా డా. వేల్స్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఇషారి కె గణేష్ మాట్లాడుతూ.. ‘సినిమా రంగంలో శింబు చేసిన విశిష్ట సేవలకు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేయడం మాకు ఆనందంగా ఉంది. మా యూనివర్సిటీలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల సేవలను పరిశోధించే కమిటీ ప్యానెల్ ఉంది. వారంతా ఈ ఏడాదికి నటుడు శింబు అర్హుడని ఏకగ్రీవంగా నిర్ణయించారు. శింబు ప్రస్తుతం వేల్స్ ఫిలిమ్స్ నిర్మాణంలో సినిమాలు చేస్తున్నాడని ఈ సత్కారం ఇవ్వలేదు. అతను పుట్టిన 6 నెలలకే సినీరంగంలో అడుగుపెట్టాడు. అంటే అతని వయసుతో పాటు సినీ ఇండస్ట్రీలో ప్రస్థానం కూడా కొనసాగుతుంది. అతని లైఫ్ టైం కృషికి గుర్తింపు అవసరమని ఈ డాక్టరేట్ అందిస్తున్నట్లు నేను స్పష్టం చేస్తున్నాను’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
Check out these pictures of #Silambarasan_TR after receiving the honorary doctorate award from Vels University.#Simbu #STR #DrSilambarasanTR pic.twitter.com/w0p87nnB4W
— Chennai Times (@ChennaiTimesTOI) January 11, 2022
ఇదిలా ఉండగా.. శింబు మల్టీ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. ఒక నటుడిగా, దర్శకుడిగా, రైటర్ గా, గాయకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని విభాగాల్లో అతని ప్రతిభ కనబరిచాడు. ఇక గతేడాది శింబు ఈశ్వరన్, మానాడు సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకొని ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో శింబుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి శింబు డాక్టరేట్ అందుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.