సినిమా హీరో అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేకపోతే ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా దుకాణం సర్దేస్తారు. ఆ లిస్టులో ఇప్పటికే చాలామంది హీరోలు ఉండనే ఉన్నారు. వారి గురించి సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ జాబితాలో హరీశ్ కచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఓన్లీ తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళం అని అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఒక్కసారిగా పూర్తిగా సినిమాల్లో కనిపించడమే మానేశాడు. అందగాడు, మంచి హీరో అయిన హరీష్ అలా సడన్ గా మాయం కావడానికి రీజన్ ఏంటి?
ఇక విషయానికొస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రవాహం లాంటిది. ఎప్పటికప్పుడు కొత్త హీరోలు, హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. సినిమాలు తీస్తుంటారు. హిట్స్ కొడుతుంటారు. కానీ కొందరు మాత్రమే హీరోలుగా నిలబడతారు. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అయితే ఇప్పుడంటే టెక్నాలజీ వల్ల ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడుంటున్నాడు అనే విషయాలు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు మాత్రం అలా ఉండేది కాదు కదా. హీరోలు ఎప్పుడో సినిమా విడుదలైతేనే కనిపించేవారు. సదరు హీరోని చూడటం కోసం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లేవారు. అలా అందగాడు, స్టార్ హీరో అనిపించుకున్న వారిలో హరీష్ కుమార్ ఒకడు.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన హరీష్ కుమార్.. చిన్న ఏజ్ లో యాక్టర్ అయిపోయాడు. ముద్దుల కొడుకు (1979) సినిమాతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సీతామహాలక్ష్మి, ప్రేమకానుక, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, త్రిశూలం, నా దేశం, శ్రీ మద్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తదితర సినిమాల్లో నటించాడు. ఇక హిందీలోకి ఎనిమిదేళ్ల వయసులోనే అడుగుపెట్టాడు. అదే టైంలో తమిళంలోనూ స్టార్ హీరోల యంగ్ వెర్షన్ పాత్రల్లో కనిపించాడు. అలా దాదాపు 20కి పైనే మూవీస్ చేశాడు. ఇక టీనేజ్ లోనే అంటే 13 ఏళ్లకే హీరో కూడా అయిపోయాడు. మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘డైసీ’తో బంపర్ హిట్ కొట్టేశాడు. ఈ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన హరీష్.. అదే ఊపులో తెలుగు, హిందీలోనూ హీరోగా వరస ఛాన్సులు కొట్టేశాడు.
హరీష్ కుమార్.. తెలుగులో ‘ప్రేమఖైదీ’ సినిమాతో సెన్సేషన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో రీమేక్ చేస్తే అక్కడా కూడా కరిష్మా కపూర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తెలుగులో హీరోగా పెళ్లాం చెబితే వినాలి, రౌడీ ఇన్ స్పెక్టర్, కాలేజీ బుల్లోడు, ప్రేమ విజేత, ఏవండీ ఆవిడ వచ్చింది, ప్రాణదాత, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం, జైలర్ గారి అబ్బాయి, ఎస్పీ పరశురాం సినిమాతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ‘ఆంధ్రకేసరి’, యాక్టర్ గా ‘ఒహో నా పెళ్లంట’ సినిమాలతో నంది అవార్డులు అందుకున్నాడు. ఆపై గోకులంలో సీత, డాడీ డాడీ, పెళ్లైంది కానీ లాంటి మూవీస్ ని చాలా ఏళ్ల గ్యాప్ తో చేస్తూ వచ్చాడు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 280 సినిమాల్లో నటించిన హరీష్ ను ప్రేక్షకులు ముద్దుగా ‘హ్యాండ్సమ్ స్టార్’ అని పిలిచేవారు. కానీ మలయాళంలో చేసిన కొన్ని సినిమాలు హరీష్ కెరీర్ నే మార్చేశాయని చెప్పాలి.
హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు దక్కుతున్న టైంలో.. హరీష్ పైన థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్దపడింది. అదే ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే మలయాళంలో ‘డైసీ’ తర్వాత రొమాంటిక్ స్టోరీల పేరుతో ఆ తరహాలో ఉండే ఐదారు సినిమాలు చేశాడు. ఇవి ఓ విధంగా హరీష్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. దీంతో ఫ్యామిలీ, రెగ్యులర్ ఆడియెన్స్ కు హరీష్ మెల్లమెల్లగా దూరమయ్యాడు. చాలామంది హరీశ్ ఫేడ్ అవుట్ కావడానికి మలయాళంలో చేసిన ఆ మూవీసే కారణమని అంటుంటారు. కానీ ఈ సినిమాలు చేసిన టైంలోనే బాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లోనూ హీరోగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో హీరో కావాల్సిన హరీష్ కాస్త.. ఛాన్సులు తగ్గిపోవడం, వ్యక్తిగత కారణాలతో క్రమంగా సినిమాల్లో కనిపించడం మానేశాడు. ప్రస్తుతం భార్యాపిల్లలతో కలిసి ముంబయిలోనే ఉంటున్నాడు. నవంబరులో తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. అంతకు 2021 డిసెంబరులో హైదరాబాద్ లో జరిగిన ‘సంతోషం అవార్డ్స్’ ఫంక్షన్ లో కనిపించాడు. మరి హరీష్ కెరీర్ విషయంలో ఫెయిల్ కావడానికి కారణాలు అంటే మీరు ఏవని చెబుతారు? అలానే హరీష్ అనగానే మీకు గుర్తొచ్చే సినిమాలేంటి? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.