శంకరాభరణం.. తెలుగు సినీ కళామాతల్లికి కళాతపస్వి కె. విశ్వనాధ్ అందించిన కీర్తి బావుట. దశాబ్దాల కాలంగా తెలుగు వాడు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన అజరామరం ఈ సినిమా. కోటి ఆస్కార్ లకు సమానమైన గౌరవాన్ని తెలుగు సినిమాకి అందించిన ఖ్యాతి శంకరాభరణం సినిమాది. ఈ చిత్రం విడుదలై 42 సంవత్సరాలు అవుతున్నా.. ఈ నాటికీ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో ఒకచోట ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం విలువని తెలియజేసిన శంకరాభరణం చిత్రాన్ని “దొరుకునా ఇటువంటి సేవ” అంటూ కీర్తిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో శంకరాభరణం చిత్రాన్నిరీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపిక చేయడం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈరోజు ఒక బాహుబలి గురించో, ఒక KGF గురించో, ఒక RRR గురించో ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకుంటేనే మనం ఇంత ఆశ్చర్యపోతున్నామే. కానీ.., ఎలాంటి స్టార్స్ లేకుండా, ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా, వందల కోట్ల బడ్జెట్ లేకుండా, శంకరాభరణం ఇంతటి ఖ్యాతిని ఎలా సొంతం చేసుకోగలిగింది? నడుములు వంగిన 60 ఏళ్ళ ముసలి వ్యక్తి హీరోగా నటిస్తే.. ఇంతటి ప్రజాదరణ ఎలా సాధ్యం అయ్యింది? శంకరాభరణం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ తరాన్ని వేదించే ప్రశ్నలు ఇవి. కాబట్టి.. ఇప్పుడు శంకరాభరణం ఎందుకు అంతటి గొప్ప చిత్రం అయ్యిందో తెలుసుకుందాం.
మీరు ఎప్పుడైనా గమనించారో లేదో.. వరదలు వచ్చినప్పుడు ఈ వరద నీరంతా సముద్రంలో కలుస్తుంది. అప్పుడు సముద్రం రెండు రంగులలో దర్శనమిస్తుంది. వరద నీరు, సముద్రం నీరు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. సముద్రం తనలో కలుపుకుందామని చూసినా.. వరద నీరు కలవదు. ఈ శంకరాభరణం కూడా అలాంటిదే. ఒక మూసలో వెళ్ళిపోతున్న సినీ సాగరంలో పవిత్ర గోదావరిలా ఈ శంకరాభరణం దర్శనమిస్తుంది.
నిజానికి ఈ తరానికి నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ శంకరాభరణంలో పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే అవి క్లాస్ కమర్షియల్ ఎలిమెంట్స్. శాస్త్రీయ సంగీతమే జీవితం అనుకుని జీవించే సంగీత పిపాసికి, శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన దుస్థితికి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఇంకెక్కడైనా ఉంటుందా? వేశ్యకు పుట్టిన తులసి, సంగీత విద్వాంసుడైన శంకరాభరణం శంకర శాస్త్రి నోట పాట విని.. సంగీతం మీద మనసు పారేసుకుంటుంది. ద్రోణాచార్యుడిని మట్టి బొమ్మగా చేసుకుని.. ఎదురుగా పెట్టుకుని విలు విద్యలు నేర్చుకున్న ఏకలవ్యుడిలా.. తులసి దూరం నుంచి శంకర శాస్త్రిని గురువుగా స్వీకరిస్తుంది. ఇంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఇంకొకటి ఉంటుందా?
తండ్రితో కలిసి కూతురు కనబడితే.. తప్పుడు అభిప్రాయంతో చూసే సమాజంలో.. తులసిని తన బృందంలో చేర్చుకుంటాడు శంకరాభరణం శంకర శాస్త్రి. విద్య నేర్చుకోవడానికి కులం ఎప్పుడూ అడ్డు కాదని చెప్పిన సన్నివేశాన్ని మించిన కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా? ఇంట్లో ఆడ కూతురు ఉండగా.. వేరే మహిళతో ఛీ..ఛీ.. అని సమాజం శంకర శాస్త్రిని నిందిస్తుంటే.. గురువు గారి ప్రతిష్ట తన వల్ల దిగజారకూడదని దూరం అయిన ఘటనకు మించిన కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా? దూరం అయ్యింది గురువుకే కాదు, సంగీతానికి కూడా!
అసలు వేశ్య కూతురికి సంగీతం మీద ఆసక్తి కలగడమే గొప్ప విషయం. అలాంటి ఆమెను తల్లి, మామ కలిసి వ్యభిచార ఊబిలోకి లాగాలని చూస్తే.. వాళ్ళతో పోరాడుతుంది. తనపై అత్యాచారం చేసిన మేనమామని మట్టుబెడుతుంది. ఇంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా? ఆ తర్వాత శంకర శాస్త్రి, తన స్నేహితుడు లాయర్ మాధవ ద్వారా ఆత్మరక్షణ కోసం హతమార్చిందని బయటకు వచ్చేలా చేస్తాడు. ఎంతో ఇష్టమైన సంగీతాన్ని నేర్చుకుందామంటే పాడు లోకం.. గురువు, శిష్యురాలి సంబంధాన్ని తప్పుడుగా చూస్తుంది. తాను ఎలాగూ సంగీతానికి దూరమయ్యాను. కనీసం తన కొడుకుకైనా సంగీతం నేర్పించాలని శంకర శాస్త్రి దగ్గర చేర్పిస్తుంది. ఆ కొడుకు తాను అనాధనంటూ శంకర శాస్త్రి దగ్గర చేరి ఇంటి పనులు చేస్తూ.. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటాడు. ఇంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా?
ప్రేక్షకులు కేజీఎఫ్ లాంటి ఎలివేషన్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ ముచ్చట కూడా ఇందులో ఉంటుంది. కుర్ర కుంకలు అర్ధరాత్రి సమయంలో ఏవో ఇంగ్లీష్ పదాలతో.. సంగీతాన్ని ఆలపిస్తూ.. అదే గొప్ప సంగీతం అనుకుని భ్రమలో ఉంటారు. ఆ సమయంలో శంకర శాస్త్రి బయటకొచ్చి.. శాస్త్రీయ సంగీతంతో వారి నోర్లు మూయిస్తాడు. శాస్త్రీయ సంగీతం నుంచే పాశ్చాత్య సంగీతం వచ్చిందని.. చెప్పే ఎలివేషన్ సీన్ వంద కేజీఎఫ్ సినిమాలని మించి ఉంటుంది. పాశ్చాత్య సంస్కృతి మోజులో శాస్త్రీయ సంగీతాన్ని అవమానించే కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసే సన్నివేశం కంటే కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా?
పాశ్చాత్య సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి జరిగే పోరాటంలో శాస్త్రీయ సంగీత విద్వాంసుడి జీవితం నలిగిపోతుంది. చినిగిన బట్టలతో, సరిగ్గా రెండు పూటలా భోజనం చేయలేని దుస్థితిలో శంకర శాస్త్రి బతుకుతుంటాడు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువవ్వడంతో బృందం మొత్తం చెల్లా చెదురవుతారు. తనకే దిక్కు లేదు. అలాంటిది తన దగ్గర పనిచేసిన వ్యక్తికి అప్పు చేసి మరీ డబ్బులు ఇస్తాడు శంకర శాస్త్రి. ఇంతకంటే గొప్ప కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా?
కుటుంబ పోషణ కోసం ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి.. కిరాణా దుకాణంలో అప్పు చేస్తూ బతికే కళాకారుడు శంకర శాస్త్రిని చూసి.. తట్టుకోలేక.. తులసి ఆయన అప్పు తీరుస్తుంది. మిగతా డబ్బుతో ‘శంకరాభరణం శంకర శాస్త్రి’ పేరు మీద ఒక సంగీత భవనాన్ని నిర్మిస్తుంది. ఇంతకంటే గొప్ప కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా? ఏకలవ్యుడు తన గురువు కోసం తన బొటనవేలుని కోసి ఇచ్చినట్లు.. అడక్కుండానే గురువు గారి కోసం తన యావదాస్తిని త్యాగం చేసిన ఘనురాలు తులసి. ఇంతకంటే కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా?
ఏదో ఒకరోజు శాస్త్రీయ సంగీతానికి పూర్వ వైభవం వస్తుందని ఆశతో జీవించిన శంకర శాస్త్రి.. తన బృందంతో కలిసి.. ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే గానామృతాన్ని ఆలపిస్తారు. తన తర్వాత ఈ గానామృతాన్ని పంచే భాగ్యాన్ని తులసి కొడుకు అయినటువంటి శంకరానికి ప్రసాదించి.. శంకర శాస్త్రి స్వర్గస్తుడవుతాడు. గురువుతో పాటు శిష్యురాలు తులసి కూడా ఆయన కాళ్ళ దగ్గర ప్రాణాలు విడుస్తుంది. ఇంతకంటే కమర్షియల్ ఎలిమెంట్ మరొకటి ఉంటుందా?
ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే హృదయాన్ని పిండేసే ఎమోషన్ ఏది అనే వారికి.. శంకర శాస్త్రి పాత్రలో జె.వి. సోమయాజులు, తులసి పాత్రలో మంజు భార్గవి ఏడిపించేస్తారు. ఇక మాధవ పాత్రలో అల్లూ రామలింగయ్య తన నటనతో అబ్బురపరుస్తారు. శంకర శాస్త్రితో స్నేహం, ఆయన అంటే గౌరవం.. అదే సమయంలో రా, రే.. అనిపిలిచేంతటి చనువు.. ఇన్ని వేరియేషన్స్ ఒక్క మాధవ పాత్రలోనే మనం చూడగలము.
ఒకప్పుడు రాజులా ఉండే శంకర శాస్త్రి ఇలా అయిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని తోటి కళాకారుడు అంటే.. నిజానికి శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని వినే అదృష్టం లేని ప్రజలదే ఆ దుస్థితి అని చెప్పే డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. శాస్త్రీయ సంగీతమే ఊపిరి అని బతికిన శంకర శాస్త్రికి గత్యంతరం లేక.. గండ పేరండ ఆభరణాన్ని తాకట్టు పెట్టి డబ్బు అడిగితే.. కిరాణా దుకాణ యజమాని.. “ప్రజలు మెచ్చి ఇచ్చిన ఆభరణం. దానికి వెల కట్టే అర్హత, స్థోమత లేవు” అని చెప్పే డైలాగ్ కి కళ్ళమ్మట నీళ్లు తెప్పిస్తాయి. “పాశ్చాత్య సంగీత సునామీలో కొట్టుకుపోతున్న శాస్త్రీయ సంగీతాన్ని చేతులు దగ్గరకు చేర్చి జ్యోతిని వెలిగించినట్టు.. ఎవరో గొప్ప మనసు చేసుకుని ఆస్తిని మొత్తం దానం చేశారు. వారికి నా నమస్కారములు” అని చెప్పే శంకర శాస్త్రి డైలాగ్ హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
ఇక తులసి పాత్రకి మాటలు ఉండవు. పొడిపొడిగా ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది అన్న విషయం తర్వాత వచ్చే పాత్రల ద్వారా తెలుస్తుంది. ఒక్క భావంతో మాత్రమే ఆమె మాట్లాడుతుంది. వేశ్య కూతురిగా.. సంగీతం పట్ల తనకున్న అభిరుచిని చాటుకునే మహిళగా అద్భుతంగా నటించిన తీరు కట్టిపడేస్తుంది. విశ్వనాథ్ దర్శకత్వం, జంధ్యాల మార్కు డైలాగులు, బాలు మహేంద్ర సినిమాటోగ్రఫీ, కె.వి. మహదేవన్ సంగీతం ఎంతగానో ఆకట్టుకుంటాయి. సామాజవరగమన, శంకరా నాద శరీరాపరా, దొరకునా ఇటువంటి సేవ వంటి పాటలు అమృతంతో చెవులని నింపేస్తాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి వంటి మహామహులు పాడిన అద్భుతమైన గానామృతం.. నాటికి, నేటికి, ఎప్పటికీ ప్రత్యేకమే.
చివరగా ఈ సినిమాని నిర్మించిన వారి ప్రస్తావన లేకుంటే అది తప్పిదమే అవుతుంది. ఈ సినిమాని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ చిత్రం మన రాష్ట్రంలోనే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా రిలీజై సంచలనం సృష్టించింది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. అమెరికాతో పాటు ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా చాటింది. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో వచ్చింది ఈ సినిమా. మళ్ళీ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే ఈ సినిమా ప్రేరణతో చాలా మంది సంగీతం నేర్చుకున్నారు. కళాత్మక విలువలు, వినోదం కలగలిపిన జనరంజక చిత్రంగా జాతీయ అవార్డుల్లో స్వర్ణ కమలం అందుకుంది. తెలుగు సినిమాల్లో స్వర్ణకమలం అందుకున్న తొలి తెలుగు సినిమా కూడా శంకరాభరణం. ఇందుకే.. అప్పటికీ, ఇప్పటికీ, ఇంకెప్పటికీ శంకరాభరణం అజరామరం. శంకరాభరణం అంటే తెలుగువారి ఖ్యాతి.