ఫిల్మ్ డెస్క్- అందాల సుందరి ఇలియానా గత కొన్నాళ్లుగా సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. వచ్చిన ఒకటి అరా సినిమా ఆఫర్లు కూడా అంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ రావడం లేదట. దీంతో చాలా కాలంగా దిగులుతో ఉన్న ఈ గోవా బ్యూటీ త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మధ్య మన తెలుగు హీరోయిన్స్ అక్కినేని సమంత, తమన్నా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేశారు. సామ్ జామ్ అనే టాక్‌షో ద్వారా సమంత, లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ ద్వారా తమన్నా ఓటీటీ ప్రేక్షకులను ఇప్పటికే అలరిస్తున్నారు. అలాగే త్వరలోనే తమన్నా కూడా ఓ టాక్ షో చేయనుందని సమాచారం.
వీరిద్దరి దారిలోనే నడవాలనుకుంటున్న ఇలియానా కూడా అతిపెద్ద డిజిటల్ మాధ్యమం అయిన అమెజాన్ కోసం ఓ టాక్‌షోను చేయనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు అమెజాన్ ఇలియానాతో సంప్రదింపులు కూడా జరిపిందట. ఇందులో భాగంగా ఓ సీజన్‌ను ముందుగా షూట్ చేసి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అంటున్నారు. తొలి సీజన్‌ను వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తర్వాత సీజన్స్ ప్లాన్ చేయాలని అమెజాన్ యోచిస్తోందని సమాచారం. దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ టాక్‌షో రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది.