పైలెట్ అవ్వాలన్నది మీ కలా..! విమానమెక్కి గగన వీధుల్లో విహరించాలనుకుంటున్నారా.. అయితే, మీకో శుభవార్త. పైలెట్ అవ్వాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. దీంతో మీ కలను సాకారం చేసుకోవచ్చు. పైలెట్ అవ్వాలన్న కోరిక అందరకీ ఉండొచ్చు.. కానీ అది అంత తేలికైన విషయం కాదు. అందునా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేద దళిత యువతకు అది అందని ద్రాక్షే. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల చదువులకు అయ్యే ఫీజు పూర్తిగా చెల్లించడమే కాకుండా వారి భోజనం, వసతి సదుపాయాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇంతకీ.. ఈ పథకం ఏంటి..? ప్రయోజనాలు ఎలా పొందాలి..? ఉండాల్సిన అర్హతలు ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? వంటి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థిక కారణాల రీత్యా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులకు చెందిన యువతీ యువకులు ఉన్నత చదువులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. టెన్త్ లేదా ఇంటర్మీడియెట్ విద్య పూర్తి కాగానే చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అందుకు కారణం.. తగిన ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థిక కష్టాలు. వీరిని దృష్టిలో పెట్టుకొని పైచదువులు చదివేందుకు ఆర్థిక తోడ్పాటు అందించాలన్నఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పథకమే.. ‘Top Class Education Scheme for SC, ST Students’. 2007-08 సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంటర్/ ప్లస్ టూ తరువాత షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులకు చెందిన యువతీ యువకులు ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ, కమర్షియల్ పైలెట్ వంటి ఉన్నత చదువులు చదవలనుకుంటే ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకోవాలనుకునే విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 3.72లక్షల స్కాలర్ షిప్ తో పాటు, విద్యార్థి వ్యక్తి గత ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 22,000 స్టైపండ్ రూపంలో అందిస్తారు. అలాగే, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత సామగ్రి కొనుగోలు కోసం ఏడాదికి రూ.3 వేలు అదనంగా చెల్లిస్తారు.అయితే, విద్యార్ధి ఈ ప్రయోజనాలు పొందాలంటే విమానయాన శిక్షణా సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉతీర్ణులై ఉండాలి. అలా అని ఉతీర్ణులైన వారందరికీ కాదు.. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ
ఈ ఏడాది ఈ పథకం కింద 22,500 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 21,500 ఎస్సీ విద్యార్థులు కాగా, 1,000 మంది ఎస్టీ విద్యార్థులను తీసుకుంటారు. వీటిలో 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు. ఒక వేళ మహిళలు అంత సంఖ్యలో లేకపోతే ఆ సీట్లను అబ్బాయిలకు కేటాయిస్తారు. ఇక అర్హతల విషయానికొస్తే.. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు ఈ పథకం వరిస్తుంది. అలాగే, ఎస్సీ విద్యార్ధి యొక్క కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు, ఎస్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి. ఎవరైనా అలాంటి విద్యార్థులు ఉంటే ముందుగా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్‌కు వెళ్లి నమోదు చేసుకోవాలి. అందుకోసం.. https://scholarships.gov.in/ ఈ లింక్ క్లిక్ చేయండి.