అతడు ప్రపంచంలోనే అగ్ర స్పిన్నర్. బౌలింగ్ కి వచ్చాడంటే వికెట్ తీయాల్సిందే. లేకపోతే పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. అలాంటి స్పిన్నర్ ని ఎంత గొప్ప బ్యాటర్ రిస్క్ ఎందుకులే అని భావిస్తాడు. కానీ సంజు శాంసన్ మాత్రం నిన్న మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగించాడు. మరి గేల్ తర్వాత శాంసన్ సాధించిన ఈ ఘనత ఏంటో చూసేద్దాం.
ఐపీఎల్ సీజన్ 16 లో థ్రిల్లింగ్ మ్యాచ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే క్రికెట్ ప్రేమికులకు వినోదం గ్యారంటీ అనేలా మ్యాచ్ లు జరుగుతున్నాయి. నిన్న రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా అనేక నాటకీయ మలుపులు చోటు చేసుకున్నాయి. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుకే విజయం వరించింది. కెప్టెన్ సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడగా.. హెట్ మేయర్ సునామీ ఇన్నింగ్స్ తో జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో సంజు శాంసన్.. రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఆధిపత్యం చూపించడం మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది. ఈ క్రమంలో శాంసన్ ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటి?
ప్రపంచంలోని అగ్ర స్పిన్నర్లలో రషీద్ ఖాన్ ఒకడు. ఈ మిస్టరీ స్పిన్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రషీద్ బౌలింగ్ కి వచ్చాడంటే వికెట్ పక్కా అనుకోవాల్సిందే. అలా కానిచో పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తాడు. సంవత్సరాలు గడుస్తున్నా.. రషీద్ ఖాన్ బౌలింగ్ ని ఎవరు డీ కోడ్ చేయలేకపోతున్నారు. దీంతో లీగ్ ఏదైనా ప్రత్యర్థుల పాలిట కొరకరాని కొయ్యలా మారాడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సంచలనం. అయితే నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసిన 4 ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్ ఖాన్ నుండి చాలా అరుదుగా మనం ఇలాంటి బౌలింగ్ స్పెల్ చూస్తూ ఉంటాము. ఎప్పటిలాగే మొదటి రెండు ఓవర్లు వేసి చాలా పొదుపుగా బౌలింగ్ చేసాడు. రెండు వికెట్లు కూడా తీసాడు. కానీ రషీద్ వేసిన 3 ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లో శాంసన్ ధాటికి ఈ లెగ్ స్పిన్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
ఈ ఓవర్లో తొలి బంతికి పరుగులేమి రాలేదు. కానీ తర్వాత వరుసగా మూడు బంతులను శాంసన్ సిక్సర్లుగా మలిచాడు. ఇక మ్యాచ్ గుజరాత్ చేతిలో ఉంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా శాంసన్ మ్యాచ్ ని ఆసక్తికరంగా మార్చేశాడు. ఏ మాత్రం భయపడకుండా వరుసపెట్టి సిక్సర్లు కొట్టడం బహుశా శాంసన్ కే సాధ్యమవుతుందేమో. ఈ క్రమంలో గేల్ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన రెండో ప్లేయర్ గా శాంసన్ నిలిచాడు. చివరిసారిగా గేల్ 2018 లో రషీద్ బౌలింగ్ లో వరుసగా నాలుగు సిక్సులు కొట్టాడు. అప్పుడు గేల్ పంజాబ్ కి, రషీద్ ఖాన్ సన్ రైజర్స్ కి ఆడుతున్నారు. మ్యాచ్ కి ముందు టాస్ సమయంలో ఈ మ్యాచ్ బాగా ఆడాలనుకుంటున్నాను అని చెప్పి మరి చెలరేగాడు సంజు శాంసన్.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ పై.. రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకి 177 పరుగులు చేసింది. జట్టులో ఎవరు అర్ధ సెంచరీ చేయకపోయినా గిల్ (45), మిల్లర్(46) రాణించారు. చివర్లో అభినవ్ మనోహర్ బ్యాట్ ఝళిపించడంతో 178 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కి విధించింది. ఇక ఛేదనలో పవర్ ప్లే లో 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్. పడికల్ కాసేపు మెరుపులు మెరిపించగా.. ఆ తర్వాత హెట్ మేయర్, శాంసన్ జోడి ఆకాశమే హద్దుగా చెలరేగారు. రాజస్థాన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వీరిద్దరూ ఆడిన తీరు అద్భుతం. ఇక చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్న అశ్విన్ ఫోర్, సిక్సర్ కొట్టి మ్యాచ్ ని రాజస్థాన్ వైపుకి మళ్ళించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికి రెండు పరుగులు రాగా.. ఆ తర్వాత హెట్ మేయర్ సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు. మరి శాంసన్ రషీద్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.