టీమిండియాలోకి అనూహ్యంగా దూసుకొచ్చిన తిలక్ వర్మ వైపు ఇప్పుడు అందరి చూపు పడింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో అదరగొట్టడంతో యువరాజ్ కు రీప్లేస్మెంట్ దొరికినట్టే అన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా.. బ్యాటింగ్ కూర్పు సెట్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సమర్థవంతమైన బ్యాటర్ కోసం భారత జట్టు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆ ప్లేస్ కోసం ఎంతో మందిని ప్రయత్నించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇలా ఎందరినో ప్రయత్నించింది. అయితే ఈ ముగ్గురు వేర్వేరు సమస్యలతో జట్టుకు దూరం కావడంతో కొత్తగా.. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ వంటి వాళ్లను పరీక్షిస్తోంది. అయితే వీరెవరూ నిలకడగా రాణించలేకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లా మారింది. ఒక్క మ్యాచ్ లో బాగా ఆడితే.. నాలుగు మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శనతో కొత్త సమస్యలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలుగొడి పేరు బలంగా వినిపిస్తోంది.
2019 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కూడా ఇలాగే నాలుగో స్థానం కోసం తెలుగు ప్లేయర్ అంబటి తిరుపతి రాయుడు ఎంపిక దాదాు ఖాయమే అనుకున్నారు. అయితే తీరా జట్టు ఎంపిక సమయానికి వచ్చేసరికి అతడిని పక్కన పెట్టి వేరేవాళ్లకు అవకాశం ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి నాలుగో స్థానంలో తెలుగు ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. తాజా వెస్టిండీస్ సిరీస్ లో సీనియర్లంతా విఫలమైన చోట ఈ హైదరాబాద్ కుర్రాడు దుమ్మురేపాడు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్న సమయంలో తన సత్తా ఏంటో నిరూపించాడు. ధాటిగా ఆడటమే కాకుండా.. అవసరమైతే నింపాదిగా ఇన్నింగ్స్ ను నిర్మించే సత్తా తనలో ఉందని నిరూపించాడు. రెండేళ్లుగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ నిలకడతో ఆకట్టుకొని జాతీయ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన రెండు టీ20ల్లోనూ వరుసగా 39, 51 పరుగుల తో ఆకట్టుకున్న తిలక్.. రెండు మ్యాచ్ ల్లోనూ భారత టాప్ స్కోరర్ గా నిలిచాడు. శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ వంటి అనుభవం ఉన్న ప్లేయర్లే ఆకట్టుకోలేక.. కఠిన పిచ్ ముందు బిక్కచచ్చిపోతే.. తిలక్ మాత్రం అదరక బెదరక పరుుగలు రాబట్టాడు. వికెట్లు పడుతున్న సమయంలో నిదానంగా ఆడి నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన తిలక్.. ఒక్కసారి కుదురుకున్నాక వేగంగా పరుగులు రాబట్టి.. తనలోని మరో కోణాన్ని పరిచయం చేశాడు. ఈ లక్షణాల వల్లే నాలుగో స్థానంలో ఇలాంటి ప్లేయర్ ఉండాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుతున్నారు. అందులోనూ తిలక్ లెఫ్ట్ హ్యాండర్ కావడం కూడా ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది. మరి ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్న తిలక్ ను వన్డే ప్రపంచకప్ కోసం సెలెక్ట్ చేసే అవకాశాలైతే తక్కువే. అయితే అతడు భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం మాత్రం ఖాయమే.