ప్రపంచం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2023 IPL వేలం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. అందరు ఊహించినట్లుగానే ఈ సారి విదేశీ ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. అమ్ముడు పోరు అనుకున్న ఆటగాళ్లు సైతం.. అమ్ముడు పోయి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా తొలి రోజు ఐపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగ నిలిచాడు సామ్ కర్రన్. ఐపీఎల్ చరిత్రలోనే రూ. 18.50 కోట్ల ధర పలికి.. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక ఐపీఎల్ నేను డబ్బు కోసం ఆడాలి అనుకోవడం లేదు, 2023 వరల్డ్ కప్ ప్రాక్టీస్ కోసం ఆడాలి అనుకుంటున్నాను అని పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. ఈ వ్యాఖ్యలకు తగిన బుద్ది చెప్పాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. చివరి దాక అతడిని కొనుగోలు చేయకుండా ఉన్నాయి. కానీ ఆఖర్లో రాజస్థాన్ రాయల్స్ బేస్ ప్రైజ్ రూ. కోటికి రూట్ ను కొనుగోలు చేసింది. కానీ అతడికి జట్టులో చోటు దక్కక పోవచ్చు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి.
జో రూట్.. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో కీలక ఆటగాడు. నిలకడైన ఫామ్ తో వన్డేల్లో, టెస్టుల్లో పరుగులు చేయడంలో అతడు సిద్దహస్తుడనే చెప్పాలి. అయితే టెస్టు బ్యాటర్ గా ముద్ర పడిన రూట్ ను టీ20ల్లో తీసుకోవడానికి సొంత జట్టు అయిన ఇంగ్లాండే ఆలోచిస్తుంది. అలాంటిది ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల్లో రూట్ ని ఎలా కొనుగోలు చేస్తారు అన్న ప్రశ్నకు.. రూట్ చౌకబారు వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైయ్యాడు. ఐపీఎల్ నేను డబ్బు కోసం ఆడాలి అనుకోడం లేదు.. వచ్చే ప్రపంచ కప్ లో భాగంగా కేవలం ప్రాక్టీస్ కోసంమే ఆడాలి అనుకుంటున్నాను అని రూట్ చెప్పుకొచ్చాడు. రూట్ కు ఐపీఎల్ పై ఇంతటి దురుద్దేశం ఉన్నప్పటికీ ఐపీఎల్ 2023 వేలానికి తన పేరును ఇచ్చాడు. ఇక తాజాగా జరిగిన వేలంలో రూట్ తీవ్రమైన అవమానం జరిగిందనే చెప్పాలి. అతడు చేసిన వ్యాఖ్యల ఫలితమో లేక అతడి ఆటతీరో కానీ అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. ఇక వేలం ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో బేస్ ప్రైజ్ రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్ రూట్ ను కొనుగోలు చేసింది.
Joe Root will play for Rajasthan Royals 🤩#CricketTwitter #IPL #RR pic.twitter.com/EUnlrTOB5e
— Sportskeeda (@Sportskeeda) December 23, 2022
జో రూట్ రూ. కోటి రూపాయలకు అమ్ముడు పోయినప్పటికీ.. అతడికి 11 మందిలో చోటు దక్కడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే జట్టులో ఇప్పటికే టీ20 స్పెషలిస్టు ప్లేయర్స్ ఉండటంతో పాటుగా.. కేవలం నలుగురు విదేశీ ప్లేయర్స్ మాత్రమే టీమ్ లో ఉండాలి అన్న నియమం రూట్ పాలిట శాపంగా మారనుంది. ఇప్పటికే రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్, హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్ తో పాటు ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ సైతం ఉండటంతో రూట్ కు ప్లేస్ దక్కదు అన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక జట్టులో యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, బట్లర్, హెట్మెయర్, పడిక్కల్ లాంటి ఐదుగురు బ్యాటర్లు ఉండగా.. ఆల్ రౌండర్ గా హోల్డర్, వ్యవహరిస్తున్నాడు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే రియాన్ పరాగ్, యుజువేంద్ర చాహల్, ఆర్.అశ్విన్, ప్రశిద్ కృష్ణ, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్ లు ఉన్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ ఇంకో బ్యాటర్ ని టీమ్ లోకి తీసుకుంటారని విశ్లేషకులు భావించడం లేదు. దాంతో రూ. కోటి పెట్టి కొన్నప్పటికి కూడా అతడికి జట్టులో చోటు దక్కకపోవడం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ డోనోవన్ ఫెరీరా.. రూట్ కు ప్రత్యామ్నాయంగా రాజస్థాన్ భావిస్తే.. రూట్ తట్ట బుట్ట సర్థుకుని బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. దాంతో రాబోయే 2023 వరల్డ్ కప్ కు మంచి ప్రాక్టీస్ అవుతుంది అని భావించిన రూట్ కు ఆశాభంగం కలగక మానదు.
Royals, here’s the man you have to Root for. 💗 pic.twitter.com/GeuvNrYVU4
— Rajasthan Royals (@rajasthanroyals) December 23, 2022