ఒకప్పుడు జట్టు విజయాల్లో కీలక పాత్ర. కానీ ఒక్క మ్యాచ్ లో ఘోర ప్రదర్శన. సొంత జట్టే సానుభూతి చూపించలేదు. పైగా తుది జట్టు నుండి తప్పించారు. ఈ దశలో యష్ దయాల్ కి నేనున్నా అంటూ తెవాటియా దైర్యం చెప్పాడు.
ఆటలో గెలుపోటములు ఎంత సహజమో.. ప్లేయర్లకు గడ్డుకాలం అంతే సహజం. సాధారణంగా ఒక ఆటగాడు ఘోరంగా విఫలైమైనప్పుడు, కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమ జట్టు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ యష్ దయాళ్ విషయంలో అలా కనబడడం లేదు. అండగా నిలబడాల్సిన జట్టే దయాళ్ ని ఇంకా వెనక్కి నెట్టినట్లు కనిపిస్తుంది. ప్రత్యర్థి ఆటగాడు రింకు సింగ్, కేకేఆర్ యాజమాన్యం చూపించిన సానుభూతి కూడా గుజరాత్ జట్టు చూపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా రాహుల్ తెవాటియా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. తెవాటియా గుజరాత్ జట్టు సభ్యుల మీద విమర్శలు చేస్తూనే.. యష్ దయాళ్ కి అండగా నిలబడ్డాడు.
కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో విజయానికి చివరి 5 బంతులకి 28 పరుగులు చేయాల్సిన దశలో యష్ దయాళ్ 5 సిక్సర్లు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధంగా రింకు సింగ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్ కి సంచలన విజయాన్ని అందించాడు. దీంతో ముఖం చూపించడానికి ఇబ్బంది పడ్డాడు ఈ ఫాస్ట్ బౌలర్. ఇదిలా ఉండగా.. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో దయాళ్ ని తుది జట్టు నుండి తప్పించిన సంగతి తెలిసిందే.
ఒక్క మ్యాచ్ లో దారుణంగా విఫలమైనంత మాత్రాన ఇలా పక్కన పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్ల నుండే కాదు ఆ జట్టు ఫినిషర్ తెవాటియా కూడా ఆవేదన వ్యక్తం చేసాడు. తెవాటియా మాట్లాడుతూ “అతడు మా జట్టులో ప్రధాన బౌలర్. గతేడాది గుజరాత్ జట్టు ఛాంపియన్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త బంతితోనే కాదు డెత్ ఓవర్లలో కూడా దయాళ్ చక్కగా బౌలింగ్ చేసాడు. ఒక్క మ్యాచ్ ద్వారా అతని ప్రదర్శన తక్కువ చేయలేము. కానీ మా జట్టులో ఒక్కరు కూడా అతని మీద సానుభూతి చూపించినట్టు కనబడడంలేదు” అని చెప్పుకొచ్చాడు.
“Because he’s the Knight #KKR deserves and the one they need right now” – Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
తమ జట్టు మీద కాస్త అసహనం వ్యక్తం చేసిన తెవాటియా యష్ దయాళ్ తో మాట్లాడానని చెప్పాడు. “ఒక్క మ్యాచ్ లో చేదు అనుభవం ఎదరైనంత మాత్రాన బాధ పడాల్సిన అవసరం లేదు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే ఇంకా వేగంగా పుంజుకోగలవు. జట్టులో ఎవరు నిన్ని ఏమి అన్నారు. నీదైన రోజునా ఆటతోనే నువ్వు సమాధానం చెబుతావు. ఇంతకన్నా గడ్డు పరిస్థితులు నీకు భవిష్యత్తులో వస్తాయని నేను అనుకోవడం లేదు. ఏదేమైనా ప్రాక్టీస్ వదలకు”. అని దయాళ్ కి తెవాటియా అండగా నిలబడ్డాడు. ఒకప్పుడు బ్రాడ్, స్టోక్స్ కూడా ఇలాంటి బాధితులే. (2007 టీ 20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్.. బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం, 2016 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో బ్రాత్ వైట్.. స్టోక్స్ బౌలింగ్ లో చివరి ఓవర్లో 4 వరుస సిక్సర్లు). అయినా వీరిద్దరూ తిరిగి పుంజుకున్న విధానం అద్భుతం. అలాగే దయాళ్ కూడా దీన్ని ఒక సవాలుగా తీసుకొని అదిరిపోయే కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.