బట్టతలపై జుట్టు మొలిపించటం ప్రస్తుత కాలంలో పెద్ద విషయం ఏమీ కాదు. అలాగని అంత సులభమూ కాదు. కొన్ని సార్లు చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది.
జట్టు ఊడిపోవటం అన్నది ప్రతీ మనిషి జీవితంలో మానసికంగా.. శారీరకంగా ఇబ్బంది పెట్టే అంశం. బట్టతల మొదలవుతున్న ఛాయలు కనిపించగానే సగం చచ్చిపోతారు యువకులు. ఆ బాధతో జుట్టు ఇంకా వేగంగా ఊడిపోతుంటుంది. బట్టతలపై జుట్టు మొలిపించటానికి మార్కెట్‌లో ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటి కారణంగా లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక, ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చుతో పాటు రిస్క్‌తో కూడుకున్న పని. దీంతో బట్టతల ఉన్న వాళ్లు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి ఈ సమయంలో శాస్త్రవేత్తలు బట్టతల బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు.
త్వరలో బట్టతలపై జుట్టు మొలిపించబోయే ఔషధాన్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. ఇంతకీ సంగతేంటంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు బట్టతలపై జుట్టు మొలిపించే విషయంపై గత కొన్ని నెలలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం ముసలి ఎలుకలు, చిట్టెకలపై పరిశోధనలు చేశారు. మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తిని పెంచటం ద్వారా స్టెమ్ సెల్స్‌లో మార్పులు తీసుకువచ్చారు. కణాలను సున్నితంగా మార్చడానికి ఆర్‌ఎన్‌ఏతో పాటు ఎమ్‌ఐఆర్ 205 ఉత్పత్తిని కూడా పెంచారు.
స్టెమ్ సెల్స్ ఎమ్‌ఐఆర్ 205ను ఎక్కువ ఉత్పత్తి చేసేలా చేయటం వల్ల ఎలుకల్లో జుట్టు పెరగటం గమనించారు. దాదాపు 10 రోజుల్లోనే ఎలుకల్లో జుట్టు పెరగటం మొదలైంది. ఇందుకోసం కొత్త స్టెమ్ సెల్స్ వాడకుండా.. పాత స్టెమ్ సెల్స్ ద్వారానే శాస్త్రవేత్తలు జుట్టు పెరుగుదలను సాధించారు. అయితే, శరీరంపైన రాసుకునే మందు ఓషధాన్ని తయారు చేసిన తర్వాత.. మరోసారి దాన్ని ఎలుకలపై ప్రయోగిస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం ఎలుకల్లో సక్సెస్ సాధించిన ఈ ప్రయోగం మనుషుల మీద సక్సెస్ సాధించకపోవచ్చు అని వారు చెబుతున్నారు.
అన్ని ఎలుకలు మనుషులతో పోలికను కలిగి ఉండవన్నారు. అందుకే మనుషులపై ఈ ప్రయోగాలు చేయటానికి కాస్త టైం పడుతుందని అన్నారు. హేయిర్ క్లోనింగ్ పద్దతి ఎలుకల్లో విజయం సాధించిందని, కానీ, మనుషుల్లో ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. గత పదేళ్లకు పైగా హేయిర్ క్లోనింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఎలుకల్లో సక్సెస్ అయిన ఈ ప్రయోగం మనుషులపై కూడా సక్సెస్ సాధిస్తే.. త్వరలో బట్టతలపై జుట్టును మొలిపించే ఓషధం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.