కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు, మోడల్ గా మారేందుకు అందం పెంచుకోవడం కోసం బ్యూటీపార్లర్ కు వెళ్లిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. జుట్టు ఊడిపోవడంతో ఆందోళన చెందుతోంది.
బరువు ఎక్కువగా ఉన్నా, అందం కాస్త తక్కువ అయిన ఏదో గిల్టీగా ఫీలవుతుంటారు కొందరు మహిళలు. దీని కోసం బ్యూటీపార్లర్లు, బరువు తగ్గించకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. ఒక్కో సారి ఆ సర్జరీలు వికటించి అందవిహీనంగా తయారయిన సందర్భాలు ఉన్నాయి. కొంత మంది హీరోయిన్స్, మోడల్స్ మరింత అందంగా కనిపించేందుకు లిప్, నోస్, ఫేస్ సర్జరీలు చేయించుకుని, అది కాస్తా ఫెయిలై ఉన్న అందం కూడా పోగొట్టుకుని బాధపడిన వాళ్లను మనం చూశాం. ఇదే రీతిలో హైదరాబాద్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అందం పెంచుకుని మోడల్ గా మారుదామని అనుకున్న ఆ మహిళకు ఊహించని షాక్ తగిలిది. ఆమె జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడుతుండడంతో లబోదిబోమంటోంది. వివరాల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్లకు వెళుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందాన్ని పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ తనను మోడల్ గా చూడాలనుకుంటున్న భర్త కోరిక తీర్చడం కోసం అబిడ్స్ లోని బ్యూటీపార్లర్ కు వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళకు పార్లర్ నిర్వాహకులు పొడవుగా ఉన్న ఆమె జుట్టును కత్తిరించి హెయిర్ ఆయిల్ పెట్టారు. ఆ ఆయిల్ పెట్టిన కాసేపటికే ఆ మహిళ జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడడం మొదలయ్యింది.
దీంతో ఆ మహిళ షాక్ కు గురయ్యింది. పార్లర్ వారు పెట్టిన ఆయిల్ వల్లనే తనకు జట్టు ఊడుతోందని ఆరోపించింది. ఊడుతున్న జుట్టుతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే బ్యూటీపార్లర్ కు వెళ్లి సోదాలు నిర్వహించార. పార్లర్ నిర్వహకులు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. జుట్టు ఊడుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందం కోసం వెళితే ఉన్న అందం కాస్త పోవడంతో ఆ మహిళ లబోదిబోమంటోంది.
\