దేశవ్యాప్తంగా ఈ హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దీని ప్రభావం పెద్దగా లేదని భావించారు. కానీ ఈ వైరస్ వల్ల కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సీజనల్ గా వచ్చే వైరస్ అయినప్పటికీ కొందరిపై మాత్రం తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్యాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ హెచ్3ఎన్2 సోకిన వారికి ముఖ్యంగా జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. నిజానికి ఇవి సాధారణ చికిత్సతోనే తగ్గిపోతాయని చెబుతున్నారు.
తెలంగాణలో అయితే ఇప్పటివరకు ఎవరినీ అడ్మిట్ చేసుకునే అవకాశం రాలేదని తెలిపారు. ఓపీల ద్వారానే ప్రస్తుతం చికిత్స జరుగుతోందన్నారు. ఈ వైరస్ ద్వారా జలుబు అనేది నిమోనియాలా మారితేనే ప్రమాదం అని చెబుతున్నారు. మరోవైపు విశాఖలో 12 హెచ్3ఎన్2 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని విద్యాశాఖ సూచిస్తోంది. ఎందుకంటే పిల్లల ద్వారా ఈ వైరస్ ఇళ్లలో ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు మరోసారి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.