మేనరికపు పెళ్లిళ్లపై ప్రజలలో భిన్నరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటిని సమర్ధించే వారు కొందరైతే.. విమర్శించే వారు మరి కొందరు. ఏదేమైనా మేనరికపు వివాహం చేసుకుంటే అవలక్షణమైన సంతానం కలుగుతుందన్న అపోహ ఉన్నదన్నది మాత్రం వాస్తవం. దేశంలో.. అందునా దక్షిణాదిన మేనరికపు వివాహాలు ఎక్కువ. అన్నదమ్ముల పిల్లలను అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇవ్వడం, మేనకోడలిని మేనమామకు ఇవ్వడం సర్వసాధారణం. ఆస్తి బయటి వారికి పోకూడదనే ఆలోచనతో కట్టబెట్టేవారు కొందరైతే, దగ్గరి వాళ్లను చేసుకుంటే అనుబంధాలు మరింత బలపడతాయన్న ఆలోచనతో ఈ పెళ్లిళ్లకు ఓకే చెప్పేవారు.. మరికొందరు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయట. ఇక మనదేశంలో ఇలా వివాహాలు మరీ ఎక్కువ. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. ఈ రకమైన పెళ్లిళ్ళ వల్ల జన్యుపరమైన సమస్యలు వస్తాయట. ఇది అందరిలోనా అంటే కాదు.. మేనరికపు వివాహం చేసుకున్నా జన్యువుల్లో ఎటువంటి లోపం లేకపోతే పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉంటాయి. పెద్దలు కూడా తమ పిల్లలకు మేనరికపు వివాహం జరిపించాలని అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మంచిది.
ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ముందుగా పిండం ఏర్పడే విధానాన్నితెలుసుకోవాలి. ప్రతి మానవుడి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమవుతుంది. ఇది తొలుత ఒకే ఒక కణంతో మొదలవుతుంది. ప్రతి మానవ కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలన్నమాట. వీటిలో మొదటి జత 23 మహిళ నుంచి, మరో 23 జత పురుషుడి నుంచి ఏకీకృతమై మొదటి కణం ఏర్పడుతుంది. దీన్నే పిండం అని అభివర్ణిస్తాం.
ఈ పిండంలో ఉంటే 23 జత క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులే తండ్రి నుంచి, తల్లి నుంచి పోలికలను మోసుకొస్తాయి. తల్లిదండ్రుల లక్షణాలూ, ఒంటి రంగు వంటి అనేక అంశాలూ తల్లిదండ్రుల నుంచే సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి. వేరువేరు కుటుంబాలకు చెందిన స్త్రీ, పురుషుడు కలవడం వల్ల ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. అదే.. ఒకే కుటుంబానికి చెందిన స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే ఇద్దరి జన్యువులు ఒకేలా ఉండొచ్చు. అంటే అనారోగ్యకర జన్యువులు కలవచ్చు. అప్పుడు పుట్టే బిడ్డలో ఏమైనా లోపాలు తలెత్తవచ్చు. అందుకే మేనరిక వివాహాలకు దూరంగా ఉండమని చెబుతారు వైద్యులు.
మేనరికం వివాహాలు చేసుకున్నవారికి పుట్టుకతోనే లోపాలతో బిడ్డలు పుట్టే అవకాశం ఎక్కువుగా ఉంటాయట. అలాగే.. రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, మూత్రపిండాల వ్యాధులు, కండరాలు, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు, బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు… వంటి అనారోగ్య సమస్యలు మేనరికపు వివాహాల్లో పుట్టిన బిడ్డల్లో కలగచ్చు. అలాగని అందరికీ ఇలాంటి పిల్లలే పుడతారని చెప్పలేం. అలాంటి పెళ్లిళ్లు చేసుకున్నవారిలో 4 నుంచి 6 శాతం మందికి పుట్టిన పిల్లల్లో ఇలా జరగొచ్చని నిపుణులు చెప్తున్నారు.
పెళ్ళై గర్భందాల్చిన మూడో నెలలో (12 వారం) ‘డబుల్ మార్కర్ టెస్ట్’ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది అని తెలుస్తుంది. ఈ పరీక్షల్లో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి కోరియా విల్లస్ బయాప్సీ చేస్తారు. అలాగే.. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. అలాగే.. బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. ఇవి మాత్రమే కాదు.. మరిన్ని పరీక్షలు కూడా ఉంటాయి. సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.
గమనిక: ఇది అవగాహన కొరకు మాత్రమే. అంతేకానీ.. మేనరికపు వివాహాలు చేసుకోకూడదు అని చెప్పడానికి ఉద్దేశించింది మాత్రం కాదు. ఈ విషయం గురుంచి మీకు ఏమైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సందర్శించడం మంచిది.