వినాయక చవితి హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ. చాలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. వినాయకుడు అంటే ఆది దేవుడు అంటారు. ఏ దేవుని పూజ చేసినా, ఏ పండుగలో అయినా ముందు పూజలు అందుకునేది ఆ గణపతి దేవుడే. అందుకే వినాయక చవితి పండుగ ఎంతో స్పెషల్. విఘ్నాలను తొలగించే దేవునిగా పేరొందిన గణపతి విగ్రహాలను ప్రతీ గ్రామంలో వీధుల్లో నిలబెట్టి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. ఆఖరి రోజున నీటిలో నిమజ్జనం చేస్తారు.
అసలు గణపతిని నిమజ్జనం ఎందుకు చేయాలి? గంగ నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేయాలి? దీని వెనుక కథేంటి? అనేది తెలుసుకోవాలంటే వినాయకుడు, వినాయకుని పిన్నికి మధ్య జరిగిన సంభాషణ తెలుసుకోవాలి. పరమేశ్వరుని అర్దభాగమైన పార్వతీ దేవి నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి వినాయకుడిని సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ద్వారం వద్ద కాపలా పెట్టడం, శివుడు రావడం, వినాయకుని శిరస్సు చేధించడం, గజాసురిని శిరస్సును అతికించి వినాయకుడ్ని బతికించడం జరుగుతాయి. ఆ తర్వాత వినాయకుడు తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తుంటాడు.
అయితే శివుడి రెండో భార్య గంగమ్మ తల్లికి వినాయకుడు అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు “ఏం గణపతి.. ఈ అమ్మతో ఉండవా? ఎప్పుడూ గౌరీ పుత్రుడిగానే ఉంటావా? గంగ పుత్రుడిగా ఉండవా” అని అడుగుతుంది. దానికి వినాయకుడు, అయ్యో అమ్మ నేను నీకు కూడా పుత్రుడినే అని అంటాడు. నీతో ఉండాలి అంతే కదా.. సరే అలాగే కానివ్వు అని అంటాడు. “గంగ మట్టితో నన్ను తయారు చేస్తారు. ఉత్సవాల్లో నా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. నిమజ్జనం రోజున నీలో నేను కలుస్తాను. అంటే ఎప్పటికీ నీతోనే ఉంటాను” అని సెలవిస్తాడు. గౌరీ(పార్వతి) నలుగు పెట్టి వినాయకుడ్ని సృష్టిస్తే.. గంగ మట్టి నుండి వినాయకుడు సృష్టించబడి.. మళ్ళీ అదే గంగలో కలిసిపోతాడు. ఇదే మట్టి గణపతి నిమజ్జనం వెనుక ఉన్న కథ. ఆ రకంగా పిన్నిని కూడా తల్లిగా భావించి గంగ పుత్రుడు కూడా అయ్యాడు.
గంగ మట్టితోనే గణపతిని ఎందుకు చేయాలో, గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేయాలో అర్ధమైంది కదా. అయితే అందరికీ గంగా నది అందుబాటులో ఉండదు కాబట్టి మామూలు మట్టితో గణపతిని చేసి, మంచి నీటి చెరువులో నిమజ్జనం చేసినా పర్వాలేదు. అయితే మట్టి గణపతిని చేయడం వల్ల మనకే మంచిది. ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం కదా. భాద్రపద మాసం, శుక్ల చతుర్థి నాడు వినాయక చవితి వస్తుంది. ఈ ఏడాది ఆగస్ట్ 31న వినాయక చవితి వచ్చింది. కాబట్టి వినాయక చవితి పూజా విధానం, పాటించవలసిన నియమాలకు సంబంధించిన సమాచారం కోసం ఈ కింది వీడియో క్లిక్ చేయండి.