ఎలాంటి పాపాల్ని అయినా, పాతకాల్ని అయినా క్షణంలో పొగొట్టే మహాదేవుడు పరమశివుడు! అందుకే, ఆయనని పూజించిన వారికి ఐశ్వర్యం మొదలు దీర్ఘాయుష్షు వరకూ అన్నీ లభిస్తాయి. కానీ, శివుడు ఎంత కరుణాసాగరుడో అంతే రుద్రుడు కూడా! ఆయన కోపిస్తే ఈ సృష్టిలో మనల్ని కాపాడగలిగేది ఏదీ లేదు. అందుకే శుభంకరుడైన శంకరునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహం తెప్పించకూడదు. మరి మహాదేవునికి కోపం తెప్పించే మహాపాపాలు ఏవో తెలుసా? శివ పురాణం ప్రకారం… ఈ పాపాలకు ఒడిగడితే… శివాగ్రహం తప్పదట. అప్పుడిక ఎవ్వరూ ఆ పాపాలు చేసిన వార్ని కాపాడలేరు! మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
* ఆడ, మగ ఎవరైనా ఇతరుల భార్య లేదా భర్తను పొందాలనే దురాలోచన చేస్తే శివుడి దృష్టిలో అది క్షమించరాని పాపం.
* ఇతరుల సంపదని అక్రమంగా పొందాలనే కోరిక ఉండటం కూడా క్షమించరాని పాపం.
* ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించాలని, వారి కలలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం.
* ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా, ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివ ఆగ్రహానికి దారితీస్తుంది!
* గర్భిణి స్త్రీల పట్ల లేదా రజస్వలగా వున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా, వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం.
* దురుద్దేశంతో ఇతరుల కీర్తి, ప్రతిష్టలకు భంగం కలిగించేలా అబద్ధాలు చెప్పడం క్షమించరాని పాపం.
* అనవసరమైన పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నించినా శివుడి దండన నుంచీ తప్పించుకోలేరు…
* హింసాకాండలో పాల్గొనడం, మహిళలు, చిన్న పిల్లలు లేదా బలహీనులపై ప్రతాపం చూపించడం క్షమించరాని పాపం.
* ఒక అమ్మాయికి తగిన వరుడిని, ఆమె కోరుకున్న వాడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం కూడా మహాపాపమే.
* కోడలితో లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం కూడా శివుని దృష్టిలో క్షమించరాని పాపం.
* గురువులు, తల్లిదండ్రులు, వృద్దులు, సన్యాసులు, వికలాంగులను తిట్టినా లేదా వారిపై చేయ్యిచేసుకున్నారుద్రుడు తీవ్రంగా దండిస్తాడట!
చూశారు కదా..? శివుడి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి పనులు జీవితంలో అస్సలు చేయకండి.