హిందువులు వైభవంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఏటా అనేక రూపాల్లో గణనాధుడు భక్తులను దర్శనమిస్తున్నారు. ప్రతీ ఏడాది ఊరూ, వాడల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి.. ఉత్సవాలు ఘనం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా గణనాధుడి వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు.కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో విగ్రహాల ధరల కూడా భారీగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలు ఉత్సవాలకు భారం కానున్నాయి.
బొజ్జ గణపయ్య విగ్రహాల ధరలు ఈ ఏడాది ఆకాశాన్ని అంటుతున్నాయి. వినాయకుడి విగ్రహాల తయారీకి ఉపయోగించే ముడి సరకు ధరలు 50 నుంచి 60 శాతం మేరకు పెరిగాయి. విగ్రహాల తయారికి సంబంధించిన సామాగ్రిని వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకోవాలన్నా రవాణా ఛార్జీలు డబుల్ అయ్యాయి. ఇదే సమయంలో కూలీల రేట్లు సైతం పెరిగాయి. దీంతో విగ్రహాల ధరల రేట్లు భారీగా పెరిగాయి. గతంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలకు వసతి, ఆహారం పెట్టి రోజుకు రూ.500 నుంచి రూ.700 ఇచ్చేవారు. ఇప్పుడు అన్నింటితో పాటు రోజు వారీ కూలీ రూ.1000 నుంచి రూ.1200 ఇస్తామన్నా వచ్చే వారు లేరని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రభావాలన్ని విగ్రహాల తయారిపై పడింది. చాలా మంది 12,14 అడుగుల ఎత్తు విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు.
గతంలో 12 అడుగుల విగ్రహాలు ధర రూ.14 వేల నుంచి రూ.20 వేలలోపు లభించేవి. ఇప్పుడు అవే విగ్రహాలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి. అదే 14 అడుగుల విగ్రహాల ధరలు గతంలో రూ.30 వేల నుంచి రూ.50 వేల లోపు ఉండేవి. ఇప్పుడు అవే విగ్రహాలు డిజైన్ బట్టి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతున్నాయి. విగ్రహాల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు, ఉత్సవ కమిటీల నిర్వహాకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ ధరకు లభించే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. ఇటు ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందనే ఆలోచనలో కొందరు ఉన్నారు.
కొందరు మాత్రం రెండేళ్లు పండుగ వేడుకలు లేకపోవడంతో ఈ ఏడాది ఖర్చుకు వెనుకాడకుండా విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వినాయక చవితి పండగ దగ్గర పడుతుండటంతో విగ్రహాల కొనుగోళ్ల హడవుడి రెండు తెలుగురాష్ట్రాల్లో మొదలైంది. మరి.. విగ్రహాల ధరలు పెరుగుటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.