భారతదేశంలో వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతియేటా అంగరంగ వైభవంగా వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన నుండి చివరిరోజు నిమజ్జనం వరకూ సంబరాలతో జరుపుకుంటారు జనాలు. అయితే.. గత కొన్నేళ్లుగా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగలలో కూడా సినిమాటిక్ మార్పులు కనిపిస్తున్నాయి. ట్రెండింగ్ సినిమాల తాలూకు లక్షణాలు గణేషుడి తయారీలో కూడా చూపిస్తున్నారు.
వినాయకుడి పండుగ అంటే విఘ్నేశ్వరుడి విగ్రహానిదే మొదటి ప్రాధాన్యత. అయితే.. కొన్నేళ్లుగా ఆయా సంవత్సరాలలో ట్రెండ్ సృష్టించిన సినీ హీరోల క్యారెక్టర్స్, యాటిట్యూడ్ లేదా పాపులర్ సన్నివేశాలను బేస్ చేసుకుని విగ్రహాలు తయారీ చేస్తున్నారు. అలా గతంలో మనం బాహుబలి సినిమా విడుదలయ్యాక ప్రభాస్ శివలింగాన్ని భుజాలపై ఎత్తుకున్న విధంగా.. ఆ ఏడాది గణపతి విగ్రహాలు చూశాం. అలాగే పలు పాన్ ఇండియా వైడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సీన్స్ ని విగ్రహాలలో చూశాం.
తాజాగా వినాయకుడి విగ్రహాల తయారీలో ఆర్ఆర్ఆర్ ట్రెండ్ చేరింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారతీయ సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు చాలా ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ ని ఎవరూ మర్చిపోలేరు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. అయితే.. ఇప్పుడు కొమరం భీంగా ఎన్టీఆర్ తో పులులు బయటకు దూకే షాట్ ని బేస్ చేసుకొని వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు వ్యాపారులు.
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది అంతటి ఇంపాక్ట్ సెట్ చేసింది ఎన్టీఆర్ పోషించిన ‘కొమరం భీమ్’ క్యారెక్టర్. హాలీవుడ్ ప్రముఖులు సైతం రాజమౌళిని, కొమరం భీం, రామరాజు క్యారెక్టర్ లను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ఇండియా వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ తాలూకు విగ్రహాలు వెలుగులోకి రావడమనేది ఆనందించే విషయమే. ఇక ప్రస్తుతం కొమరం భీం గణేష్ విగ్రహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కొమరం భీం గణేషుడి విగ్రహాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.