హిందువుల అతి పవిత్రమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. హిందువుల క్యాలెండర్ ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 1న మంగళవారం అంటే నేడు శివరాత్రిని జరుపుకుంటున్నారు. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే.. ఆ కష్టాలు తీరతాయి అంటున్నారు పండితులు. ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలుంటే, మహా శివరాత్రి రోజున జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు అని వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు..
మహా శివరాత్రి రోజున ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఇంత పవిత్రమైన రోజున ఈశ్వరుడి దర్శనం తప్పక చేసుకోవాలి అంటున్నారు. ముఖ్యంగా రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అంటున్నారు పండితులు. అందకే ఈ శివరాత్రి రోజున.. ఉపవాసం ఉండి కనీసం ఒక్క బిల్వ పత్రాన్ని అయినా పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు వివరిస్తున్నారు.
మహా శివరాత్రి రోజున పరమేశ్వరునికి పెరుగుతో రుద్రాభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది. భోలా శంకరుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. మహా శివరాత్రి రోజున తేనే, నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది.. మీకు శుభ ఫలితాలొస్తాయి అంటున్నారు పండితులు.
మీకు రావాల్సిన బకాయిలు రాకుండా ఇబ్బంది పెడుతుంటే.. మహా శివరాత్రి రోజున.. శివుని వాహనం నంది అంటే ఎద్దుకు పచ్చి మేత తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి అంటున్నారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం 108 మహామృత్యుంజయ మంత్రాలు జపించండి. శివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు.
ఇక జాతకంలో గ్రహాల స్థితి బలహీనంగా ఉంటే, మహా శివరాత్రి రోజున శివ లింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఏదైనా సమస్య ఉంటే, మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, నీటిలో తేనే కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. దానిమ్మ పువ్వులను సమర్పించాలి.
మహా శివరాత్రి రోజున పేదలకు సహాయం చేయడం వల్ల జీవితంలోని అన్నిరకాల సమస్యలు తీరతాయి. కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటే, మహా శివరాత్రి రోజున, మీరు శివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. మహా శివరాత్రి రోజున వెండి కమలంతో శివునికి జలధారతో అభిషేకం చేస్తూ, ఓం నమః శివాయ, ఓం పార్వతీపతయే నమః అనే మంత్రాలను 108 సార్లు జపిస్తే ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది అంటున్నారు పండితులు.