హీరోగా, విలన్ గా, హాస్యనటుడిగా, విలక్షణ నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు పుట్టిన రోజు ఈరోజు. ఈ మార్చి 19తో ఆయన 71వ ఏటలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా ఫెయిలయ్యానని ఎప్పుడూ సిగ్గుపడలేదని, విలన్ గా చేయడం పట్ల బాధపడలేదని అన్నారు. డబ్బు పోయిందని ఏనాడూ బాధపడలేదని వెల్లడించారు.
మోహన్ బాబు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి నుంచి వచ్చి ఇవాళ ఉచితంగా ఎంతోమందికి చదువు అందించే స్థాయికి ఎదిగారు. సినిమానే జీవితంగా బతికారు. ఇప్పటికీ అలానే కొనసాగుతున్నారు. అయితే అదే సినిమా ఆయనకు కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది, డబ్బు సంపాదించి పెట్టింది. మళ్ళీ అదే సినిమా ఆయన సంపాదించిన ఆస్తులను పోగొట్టింది. కానీ ఎప్పుడూ ఆయన కుంగిపోలేదు. ఆలయంలోని ధ్వజస్థంభంలా నిలబడ్డారు. అదే మోహన్ బాబు. హీరోగా, నటుడిగా, విలన్ గా, విలక్షణ పాత్రలు పోషించగల సమర్థుడుగా ఎంతో ఘనత సాధించిన మోహన్ బాబు నిర్మాతగా ఫెయిల్యూర్స్ చూశారు. చాలా డబ్బు నష్టపోయారు.
చాలా మంది హీరోలు నిర్మాణ రంగంలోకి దిగి సొంత బ్యానర్ పెట్టి సక్సెస్ అయ్యారు కాబట్టి తాను కూడా పెడితే బాగుంటుందని చెప్పి నిర్మాణ రంగంలోకి దిగానని మోహన్ బాబు అన్నారు. అయితే సొంత బ్యానర్ స్టార్ట్ చేయడం తన గురువు దాసరి నారాయణరావుకి ఇష్టం లేదని.. డబ్బులు పోగొట్టుకుంటానన్న భయం ఉండేదని అన్నారు. అయితే ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో ఇప్పుడు వస్తున్న సినిమాలు ఫెయిలవుతుండడంపై మోహన్ బాబు స్పందించారు. ఫెయిల్యూర్స్ ని మనం కొనుక్కోలేదని, వస్తున్నాయని, ప్రయాణంలో ఎక్కడో తప్పు జరుగుతుందని, కథ గానీ, దర్శకుడు గానీ, కథల ఎంపిక విషయంలో గానీ తప్పు జరుగుతుందని అన్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పవారే అని, మంచి సినిమాలను వారు ఆదరిస్తారని అన్నారు. అయితే సినిమాల వల్ల తన ఆస్తులు అమ్ముకున్నానని మోహన్ బాబు అన్నారు. తన కెరీర్ లో తనను నిలబెట్టిన నిర్మాత ఎవరూ లేరని.. తనకు తానే అని అన్నారు.
కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తనకు తానే అని, తనకెవరూ సహాయం చేయలేదని.. ప్రకృతి మాత్రమే తనకు సహాయం చేసిందని అన్నారు. ఫెయిలైనా, సక్సెస్ అయినా తన బాధ తానే పడ్డానని అన్నారు. తాను సంపాదించుకున్న ఆస్తులను తానే అమ్ముకున్నానని.. మంచి మంచి ఆస్తులను సినిమాల కోసం అమ్ముకున్నానని అన్నారు. సాధిస్తానని అనుకుని సినిమాలు తీశాను, కానీ ఆస్తులను కోల్పోయానని అన్నారు. సాధిస్తానన్న నమ్మకంతో సినిమాలు తీసి మళ్ళీ సాధించానని.. ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. ఇక తన కొడుకులైన విష్ణు, మంచు మనోజ్ లు ఇండస్ట్రీలో సక్సెస్ రేటు లేకపోవడంపై కూడా స్పందించారు.
క్యారెక్టర్ లేకపోతేనో, నటన రాకపోతేనో బాధపడాలి గానీ సక్సెస్ రాలేదని బాధపడకూడదని అన్నారు. అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. సక్సెస్ ఈరోజు కాకపోతే రేపు వస్తుందని.. నటులుగా తన పిల్లల విషయంలో గర్వపడుతున్నానని అన్నారు. ప్రతీది భగవంతుడు ఇచ్చిందే కాబట్టి పాజిటివ్ గానే ఉంటానని అన్నారు. ఇంత పాజిటివ్ గా ఆలోచించే మోహన్ బాబుకు సుమన్ టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరి మీరు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. అలానే ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.