మన ప్రతీ ఎమోషన్‌కు ఏదో ఒక హార్మోన్ కారణం అయి ఉంటుంది. మనిషి ఎదుగుదలను, జీవితాన్ని నిర్ధేసించేవి కూడా హార్మోన్సే. ప్రేమగా భావించే ఇష్టం లేదా ఆకర్షణకు గురైనపుడు.. బుద్దిపై కొన్ని హర్మోన్ల ప్రభావం పడుతుంది. మనం ఎవరితో అయితే ప్రేమలో ఉంటామో వారి కోసం ఎంతకైనా తెగించాలని అనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు విచక్షణ కూడా మర్చిపోతాము. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ తాజా సంఘటన. ఈ ఘటనలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి బర్త్‌డే పార్టీ సెలెబ్రేట్ చేసుకోవటానికి ఏకంగా సొంతింటికి కన్నం వేసింది. అబద్దం ఆడి కేసును తప్పుదోవపట్టించాలని చూసింది.
కానీ, చివరకు దొరికిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన ఓ యువతి జనవరి 7న కాపుర్బావ్డీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన మిత్రుడు ఒకరు తన అశ్లీల చిత్రాలు తీశాడని ఫిర్యాదు చేసింది. ఆ చిత్రాలను చూపెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఇందు కారణంగా తన ఇంట్లో తానే దొంగతనం చేయాల్సి వచ్చిందని అంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె చెప్పిన యువకుడ్ని విచారించారు. సీసీ టీవీ కెమెరాలను సైతం పరిశీలించారు.
చివరకు కేసు పెట్టిన యువతే తప్పు చేసిందని తేల్చారు. ప్రియుడితో పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవటానికి ఇంట్లో నగలను దొంగతనం చేసిందని, వాటిని ప్రియుడికి ఇచ్చిందని కనుగొన్నారు. తనను తాను కాపాడు కోవటానికి వేరే యువకుడిపైకి నేరాన్ని తోసిందని గుర్తించారు. యువతి అమ్మిన నగల్ని కొన్న నగల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. యువతి, యువకుడిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరి, ప్రియుడితో పుట్టిన రోజు జరుపుకోవటానికి సొంతింటికి కన్నం వేసిన ఈ యువతి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.