పానీపూరీ అంటే ప్రాణం ఇచ్చే వాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. రోజూ సాయంత్రం అవ్వగానే పానీపూరీ బండి దగ్గర వాలిపోయి పదుల సంఖ్యలో పానీపూరీ తింటూ ఉంటారు కొందరు.
భారత్‌లో పానీపూరీ అంటే పడిచచ్చేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉంటారు. ‘మాకు పానీపూరీ అంటే ప్రాణం.. రోజుకు ఒకసారైనా పానీపూరీ తినకపోతే రోజు పాణం సల్లగుండదు’ అనే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుభ్రత లేని పానీపూరీ తిని ఆరోగ్యంపాడైనా కూడా దాన్ని తినటం మానటం లేదు. పానీపూరీ తయారీదారులు సరైన శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల వాటిని తినే వాళ్లు ఎన్నో రకాల వ్యాధుల బారినపడుతున్నారు. ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా, ఓ యువతి పానీపూరీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురై చనిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, మైలాపూర్‌కు చెందిన 24 ఏళ్ల మోనిష కొద్ది రోజుల క్రితం తన స్నేహితురాళ్లతో కలిసి చెన్నైలోని మెరీనా బీచ్‌కు వెళ్లింది. అక్కడ పానీపూరీని బాగా ఆరగించింది. పర్యటన అనంతరం అందరూ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. తిరువల్లికేని ఫ్లైయింగ్ రైల్వే స్టేషన్ నుంచి తిరువాన్‌ముయిర్‌కు బయలు దేరారు. ఈ నేపథ్యంలోనే మోనిష మైలాపూర్ ఫ్లైయింగ్ రైల్వే స్టేషన్ వద్ద మెట్లు ఎక్కుతూ అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుని కిందపడిపోయింది.
దీంతో ఆమెను దగ్గరలోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లసాగారు. అయితే, మోనిష మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవటానికి ముందు ఆమె తిన్న పానీపూరీ కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరి, శుభ్రత లేని పానీపూరీ కారణంగా దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.