దేశ వ్యాప్తంగా నానాటికి డ్రగ్స్ వినియోగం పెరుగుపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతను చిత్తు చేసే మాదక ద్రవ్యాల వ్యాపారానికి భారత్ కేంద్రం చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ డ్రగ్స్ పట్టబడటం చూస్తుంటే ఈ వ్యాపారం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలుస్తుంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోజు రోజుకీ డ్రగ్స్ దందా చాపకింద నీరులా వ్యాపిస్తుంది.
2016లో ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల్లో భారత్‌లోనే 6 శాతం అంటే దాదాపు 300 టన్నులు బయటపడింది. 2017 నాటికి అది 20శాతం పెరిగి 352 టన్నులకు చేరుకుంది. విదేశాల నుంచి రక రకాల పద్దతుల్లో డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లో డ్రగ్స్‌తో కూడిన 60 క్యాప్సూల్స్‌ను తన ప్రైవేట్ పార్ట్స్‌లో దాచుకున్న ఆఫ్రికన్ మహిళను అధికారులు పట్టుకున్నారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళను అరెస్టు చేశారు. నిందితురాలు ఆఫ్రికా నివాసి అమనీ హావెన్స్ లోపెజ్ అని అధికారులు చెబుతున్నారు.
విచారణ సమయంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం మహిళను అరెస్టు చేసింది. అక్కడి నుంచి సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో మహిళ ప్రైవేట్ పార్ట్‌లో దాచిన 60 క్యాప్సూల్స్‌ను వైద్యుల బృందం గుర్తించింది. అయితే ఈ క్యాప్సూల్స్ రెండు కిలోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే మహిళ ప్రైవేట్ పార్ట్ నుండి క్యాప్సూల్స్ తొలగించడానికి 2 రోజులు పట్టింది. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు 16 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.