ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నప్పటికి ప్రయోజనం లేకుండా పోతుంది. మత్తు పదార్థాల వాడకంతో యువత భవిష్యత్ ను నాశనం చేసుకుంటుంది.
కొందరు డ్రగ్స్ కు బానిసై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇకపోతే పార్టీల పేరుతో పబ్స్ లో మధ్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వాడి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే కోవకు చెందిన విషయంలో కర్ణాటక రాష్ట్రంలో పబ్ లపై దాడులు చేసిన పోలీసులు పలువురు విదేశీ మహిళలను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
నేటి యువత నగరాల్లో వీకెండ్ పార్టీలతో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. పబ్ లకు వెళ్లి డ్రగ్స్ తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఎంజి, బ్రిగేడ్ రోడ్లలో బార్లు, పబ్ లలో డ్రగ్స్, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో చోటు చేసుకుంటున్న అనైతిక కార్యకలాపాలను అణచివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా డిసిపి శ్రీనివాస్ గౌడ పోలీస్ బృందాలతో వెళ్లి పబ్ లపై దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆఫ్రికన్ మహిళలు, పురుషులతో కలిపి అదుపులోకి తీసుకున్నారు.
వీరందరిని డ్రగ్స్ టెస్టుల కోసం బౌరింగ్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా వారందరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇదిలా ఉండగా పోలీసులు దాడులు చేసే సమయంలో ఆఫ్రికన్ మహిళలు పబ్ ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. మరికొందరు మధ్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆఫ్రికన్ మహిళలకు పరీక్షల అనంతరం వారిని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారి పాస్ పోర్టు, వీసాలను తీసుకురావాలని వారికి సంబంధించిన వారికి పోలీసులు చెప్పారు. కానీ పాస్ పోర్టు వీసాలను ఎవరూ కూడా తీసుకురాలేదు. దీంతో వారిపై డ్రగ్స్ కేసుతో పాటు అక్రమ వలస కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు పోలీసులు.