మీరు రీల్స్ చేస్తారా.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేయండి.. డబ్బులు సంపాదించండి అనే ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం.. కరోనా ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా తయారయ్యింది. కరోనా ముందు వరకు కేవలం యువత మాత్రమే ఎక్కువగా సోషల్ మీడియా వినియోగించేవారు. కానీ కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించడం.. అందరు ఇళ్లకే పరిమితం కావడంతో.. ఏం చేయాలో పాలుపోక.. టైమ్ పాస్ చేయడం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ట్విట్టర్.. దేన్ని వదలలేదు. వెరసి టైమ్ పాస్ కోసం మొదలుపెట్టిన హ్యాబిట్ కాస్త.. వ్యసనంగా మారింది. నేడు చిన్నారులు మొదలు.. ముసలి వాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మన చుట్టూ జరిగే సంఘటనలను వీడియోలు తీయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే పనిగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏం పని చేస్తోన్నా సరే.. దాన్ని వీడియో తీయడం.. మ్యూజిక్ యాడ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ రీల్స్‌కు అలవాటయ్యారు.
రీల్స్ చేస్తూ.. మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధిస్తూ.. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ రీల్స్ చేసేవారికి తెలంగాణ సర్కార్.. గుడ్ న్యూస్ చెప్పింది. తాము చెప్పిన కాన్సెప్ట్‌కు తగ్గట్టు ఆకట్టుకునేవిధంగా రీల్స్ చేస్తే.. భారీ మొత్తం నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఇంతకు దేనికి సంబంధించి ఈ రీల్స్ అంటే.. డ్రగ్స్ వాడకం.. దాని వల్ల కలిగే చెడు ఫలితాల గురించి తెలపడం కోసం. తెలంగాణ సమాజంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. స్కూల్ ఏజ్‌లోనే ఈ అలవాటుకు బానిసలుగా మారి.. బంగారు భవిష్యత్తును.. అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు యువత. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. మాదక ద్రవ్యాల వినియోగం, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా జూన్ 26 న అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ ఏడాది జూన్ 26 సందర్భంగా.. మాదకద్రవ్యాల వినియోగం, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి జనాలకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా షార్ట్ వీడియో కాంటెస్ట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రసుత ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించడం కోసం “డ్రగ్స్ అండ్ ఇట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ” పేరుతో పోలీస్ శాఖ ఈ వీడియో కాంటెస్ట్ నిర్వహించనుంది.
ఈ పోటీకి 18 ఏళ్ల వయస్సు పైబడినవారందరూ అర్హులేనని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే చెడు ప్రభావాలు, డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన వారివల్ల కుటుంబసభ్యులు పడే బాధలను కళ్లకు కట్టినట్లు ఈ రీల్స్‌లో చూపించటమే.. ఈ కాంటెస్ట్ ఉద్దేశం. అయితే.. 3 నిమిషాల నిడివితో ఈ వీడియోను రూపొందించాల్సి ఉంది. కాగా.. ఈ వీడియోలను జూన్ 20 లోపు పంపిచాల్సి ఉంటుంది. అత్యుత్తమంగా రీల్స్ చేసిన వారికి ప్రభుత్వం ప్రైజ్ మనీ కింద భారీ మొత్తాన్ని అందజేయనుంది. మొదటి విజేతకు 75 వేల రూపాయలు, రెండో విజేతకు 50 వేలు, మూడో విజేతకు 30 వేల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు.. మరింత సమాచారం కోసం 96523 94751 నెంబర్‌కు ఫోన్ చేసి.. తెలుసుకోవచ్చు.