ప్రతీ తల్లిదండ్రులు.. తమ బిడ్డల చదువు కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కలలు కంటూ ఉంటారు. తమ బిడ్డలు బాగా చదవాలని ఉన్నత శిఖరాల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. తమకు తినడానికి ఉన్నా లేకపోయినా.. అప్పులు చేసి మరీ బిడ్డలను చదివిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బిడ్డల చదువుల కోసం చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా, ఓ మహిళ తన పిల్లల చదువుకోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం మూటపల్లికి చెందిన అరికెల్ల లావణ్య అనే 40 ఏళ్ల మహిళ ఆశ వర్కర్‌గా పనిచేస్తోంది.
ఆమె భర్త బుచ్చయ్య అరబ్ దేశంలో ఉన్నాడు. అక్కడ సరిగా పని లేకపోవటంతో బుచ్చయ్య ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ముగ్గురు కూతుళ్లను లావణ్య సాకుతోంది. ముగ్గుర్ని బాగా చదివిస్తోంది. ఆమె ఇద్దరు కూతుళ్లు హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదువుతుండగా.. చిన్న కూతురు కరీంనగర్‌లో పాలిటెక్నిక్ చదువుతోంది. లావణ్య తన ముగ్గురు బిడ్డల చదువు కోసం భారీగా అప్పులు చేసింది. ఆమెకు దాదాపు 10 లక్షల రూపాయల దాకా అప్పులు ఉన్నాయి. అయితే, అప్పు తీర్చటానికి ఆమె ఆర్థిక స్థోమత సరిపోలేదు. ఎంత వెతికినా ప్రత్యామ్నాయం కనిపించలేదు.
ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఉరికి వేలాడుతున్న ఆమెను గమనించిన పొరిగింటి వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. లావణ్యను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. లావణ్య తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, బిడ్డల చదువుకోసం అప్పులు చేసి ప్రాణాలు తీసుకున్న లావణ్య ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.