మృత్యువు ఎప్పుడు? ఎలా? ఎవరిని కబళిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. ఇది ప్రాణంతో ఉన్న ప్రతీ జీవికి వర్తిస్తుంది. ఇప్పటి వరకు బాగున్న వారు.. అంతలోనే చనిపోతుంటారు. మృత్యువు ఏదో ఒకరూపంలో జీవుల్ని పట్టుకుపోతుంది. దానికి సొంతాలు, బంధాలు అన్న తేడా ఉండదు. తాజాగా, విజయవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వాటర్ హీటర్ కారణంగా ఓ రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తండ్రీకూతుళ్లు చనిపోయారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
విజయవాడలోని రామకోటి మైదానం, పాపిట్లవారి వీధికి చెందిన ఇప్పిలి సింహాచలం, వరాలమ్మ భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు మంగమ్మ ఉంది. ఈమెకు పదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత భర్తతో విభేదాల కారణంగా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటి వద్దే ఉంటోంది. ఆ పిల్లలు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. సింహాచలం పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులనుంచి ఇంటికే పరిమితం అయ్యాడు. దీంతో వరాలమ్మ, మంగమ్మలు ప్రతి రోజు సాయంత్రం వరకు ఇళ్లలో.. ఆ తర్వాత సాయంత్ర నుంచి ఫుడ్ కోర్టులో పని చేస్తు ఉన్నారు.
గురువారం సాయంత్రం మంగమ్మ తన పిల్లలకు స్నానం చేయించి ట్యూషన్‌కు పంపింది. ఆ తర్వాత సింహాచలం వేడినీళ్లు కాచుకోవటానికి ప్లాస్టిక్ బకెట్‌లో హీటర్ పెట్టి స్విచ్ వేశాడు. దీంతో అతడికి విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కిందపడిపోయాడు. అది గమనించిన మంగమ్మ తండ్రిని పట్టుకుంది. దీంతో ఆమెకు కూడా షాక్ తగిలింది. ఇద్దరూ మృత్యువాతపడ్డారు. వీరిద్దరినీ కాపాడే ప్రయత్నంలో పొరిగింట్లో ఉండే సీత అనే మహిళ తీవ్రగాయాల పాలైంది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.