శ్వేత పెళ్లి తర్వాత చాలా సార్లు తన తల్లికి ఫోన్ చేసింది. అత్తింట్లో తాను పడుతున్న కష్టాలను ఆమెకు చెప్పుకుంది. ముఖ్యంగా తన భర్త మీద ఉన్న ప్రేమను.. భర్త తనను పట్టించుకోకపోవటాన్ని తల్లికి చెప్పుకుని ఏడ్చింది.
వైజాగ్‌కు చెందిన వివాహిత శ్వేత మరణం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటినుంచి ఆమె కనిపించకుండా పోవటం.. బీచ్‌లో శవంగా తేలటం క్రైం సినిమాను తలపిస్తోంది. ఐదు నెలల గర్బంతో ఉన్న శ్వేత ఆత్మహత్య చేసుకోవటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఇక, శ్వేత పెళ్లి తర్వాత భర్తే లోకంగా బతికింది. ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు.. తనకు తన భర్త ఉంటే చాలు అనుకుంది. కానీ, ఆ భర్తే ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. శ్వేత కంటే తన అక్కాచెల్లెళ్లు, వారి పిల్లలే ఎక్కువనుకున్నాడు.
గర్భంతో ఉన్నపుడు కూడా ఆమెను సరిగా పట్టించుకోలేదు. ఆఖరికి అత్తింటి వాళ్లు కూడా ఆమెను ఓ పరాయి దానిలా చూశారు. ఇవన్నీ చూసి శ్వేత తట్టుకోలేకపోయింది. తన బాధలను తల్లికి ఫోన్ ద్వారా చెప్పి ఏడ్చేది. ఎంత చెప్పినా.. ఏం చేసినా తన జీవితంలో మార్పు రాకపోవటంతో ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత తన భర్త గురించి తల్లికి చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. శ్వేత తన తల్లితో ఈ మాటలను తరచుగా అనేది. ‘‘నాకు నా భర్త కావాలమ్మా.. నా మణి నన్ను అర్థం చేసుకోవటం లేదమ్మా.. నేను ఆయన్ని ఇష్టపడ్డానమ్మా.. చాలా ప్రేమగా ఉన్నానమ్మా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకునేది.
భర్త కోసం తన బిడ్డ పడ్డ ఆవేదనను శ్వేత తల్లి మీడియాతో చెబుతూ కన్నీటి పర్యంతం అయింది. భర్త మణికంఠ తన కూతుర్ని అర్థం చేసుకోలేకపోవటం కారణంగానే ఈ దారుణం జరిగిందని అంటోంది. కాగా, మంగళవారం శ్వేత అత్తింటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి బీచ్‌లో శవమై కనిపించింది. శ్వేత వైవాహిక జీవితం ఏప్రిల్ 15, మొదలై.. అదే ఏప్రిల్ నెలలో ముగిసింది. ఆమె వైవాహిక జీవితంతో పాటు ఆమె జీవితం కూడా సముద్రంలో కలిసిపోయింది. మరి, శ్వేత మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.