దేశవ్యాప్తంగా రోజూ ఏదొకమూల ఘోరమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవలికాలంలో ఢిల్లీ శ్రద్ధా వాకర్ కేసు యావత్ దేశాన్నే విస్తుపోయేలా చేసింది. ప్రేమించిన యువకుడే ఆమెను హత్యచేసి ముక్కలు చేసి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. హత్య చేసిన కొన్ని నెలల తర్వాత ఆ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. అంత ఘోరమైన ఘటన గురించి తెలుసుకున్న ప్రజలు నివ్వెరపోయారు. అయితే ఆ తర్వాత అలాంటి ఘటనలో కొన్ని వెలుగు చూశాయి. ఇప్పుడు తాజాగా వైజాగ్‌లో ఇలాంటి ఘటన ఒకటి బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ మధురవాడ వికలాంగుల కాలనీలో ఈ దారుణం వెలుగు చూసింది. ఓ మహిళను హత్య చేసి ఆమెను ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టారు. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి సీల్ చేశారు. కొన్నిరోజులుగా ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఓనర్ వచ్చి ఇంటిని పరిశీలించగా.. లోపల ఒక ప్లాస్టిక్ డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ తెరిచి చూడగా అందరూ భయంతో వణికిపోయారు. ఆ డ్రమ్ లోపల కవర్లలో పూర్తిగా కుళ్లిపోయిన శరీర భాగాలు ఉన్నాయి. ఎవరో కూడా గుర్తించే పరిస్థితి లేకుండా మృతదేహం కుళ్లి పోయింది. హత్య జరిగి దాదాపు 6 నెలల నుంచి సవంత్సరం అయి ఉండచ్చని భావిస్తున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ చేరుకుని ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు.
ఇంటి యజమాని పేరు నండూరి రమేశ్. అతను వేరే ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంటాడు. అతను వెల్డర్‌గా పనిచేసే ఓ వ్యక్తి ఇల్లు అద్దెకు ఇచ్చాడు. కొన్నాళ్లు అంతా బాగానే ఉంది. తర్వాత తన భార్య ప్రసవానికి ఇంటికి వెళ్తోంది అని చెప్పి అతను కూడా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఏడాదిన్నరగా ఇంటికి రాకుండా నా భార్య గర్భవతి, మొన్నే కొడుకు పుట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు. నాకు డబ్బు రావాల్సి ఉంది అద్దె మొత్తం ఒకేసారి ఇచ్చేస్తానంటూ అతను చెప్పుకుంటూ వచ్చాడు. సరే అద్దె వస్తుంది కదా అని రమేశ్ కూడా ఊరుకున్నాడు. అలాగే యజమానికి కాస్త ఆరోగ్యం బాగోకపోవడంతో ఇంటిని పరిశీలించలేదని చెబుతున్నాడు. హత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.