డబ్బు మనిషి నాశనం అవటానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. కేవలం ఓ 500 రూపాయలు ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. ఎంతో సాఫీగా సాగుతున్న జీవితంలో కలతలు సృష్టించింది. ఓ ప్రాణం బలికాగా.. మరికొన్ని ఆసుపత్రిలో...
ఈ మధ్య కాలంలో బంధాలు చాలా బలహీనపడిపోతున్నాయి. ముఖ్యంగా దాంపత్యం విషయంలో చిన్న చిన్న అనుమానాలే పెనుభూతాలుగా మారుతున్నాయి. కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. అనుమానం ఉన్న వారికి చిన్న విషయం కూడా దారుణమైన తప్పుగా కనిపిస్తుంది. క్షణికావేశంలో ప్రాణాలు తీసే స్థాయికి తీసుకెళుతుంది. తాజాగా, ఓ వ్యక్తి కేవలం 500 రూపాయల కారణంగా తన కుటుంబాన్ని నాశనం చేశాడు. భార్యాబిడ్డల్ని చంపే ప్రయత్నం చేశాడు. భార్య చనిపోగా.. ముగ్గురు కుమార్తెలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని తుముకూరు జిల్లా, మధుగిరి తాలూకాలోని ముద్దనరళకెర గ్రామానికి చెందిన రామాంజినప్ప, కాంతమ్మ భార్యాభర్తలు.
రామాంజినప్ప ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రామాంజినప్పకు, కాంతమ్మకు మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో నిత్యం ఆమెను వేధిస్తూ ఉండేవాడు. హత్య జరిగిన రోజు రాత్రి రామాంజినప్ప పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య కాంతమ్మ దగ్గర రూ. 500 రూపాయలు ఉండటం గమనించాడు. ఈ డబ్బులు నీ దగ్గరకు ఎలా వచ్చాయి? అంటూ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ తారాస్థాయికి చేరింది. తర్వాత రామాంజినప్ప కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. రాత్రి భార్య కాంతమ్మ, ముగ్గురు కూతుళ్లు నిద్రపోతూ ఉండగా ఇంటికి వచ్చాడు. నిద్రపోతున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అనంతరం అక్కడినుంచి పరుగులు తీశాడు. మంటల్లో కాలుతున్న నలుగురు గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దీంతో స్థానికులు అక్కడికి వచ్చారు. మంటల్ని ఆర్పారు. అయితే, కాంతమ్మ మంటల్లో కాలి ప్రాణాలు వదిలింది. మిగిలిన ముగ్గుర్ని వారు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రామాంజినప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, భార్య మీద అనుమానంతో కుటుంబాన్ని నాశనం చేసిన రామాంజినప్ప ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.