ఇటీవల పెళ్లైన ఒక్క ఏడాదికే భార్యాభర్తల మద్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు రావడంతో క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల ఆశీర్వాదం..మూడు ముళ్లబంధంతో ఒక్కటవుతారు కొత్తజంట. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ ఈ మద్య పెళ్లైన ఒక్క ఏడాది లోపే దాంపత్యజీవితంలో ఎన్నో అరమరికలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. ఇటీవల కాలంలో దాంపత్య జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య, గొడవలు జరగడంతో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు పడే ఈ కాలంలో భార్య కోసం ఓ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా కొండన్నగూడ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండన్న గ్రామానికి చెందిన కందనోళ్ల రాజేష్ (35) కి అదే గ్రామానికి చెందిన శ్వేతతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కొంతకాలంగా షాద్‌నగర్ లో రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మద్య చిన్న చిన్న విభేదాలు రావడంతో తరుచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలోనే శ్వేత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో రాజేష్ భార్య తిరిగి రావడం లేదన్న మనస్తాపంతో శుక్రవారం రాత్రి గుళికల మందు ప్యాకెట్ తీసుకొని కొండన్నగూడ గ్రామ శివారులోని తన పొలానికి వెళ్లాడు.
‘శ్వేత నీతో గడవపడినా.. అర్థరాత్రి వచ్చి నీతో మాట్లాడేవాడిని.. మూడు రోజులుగా నన్ను ఒంటరివాడిని చేశావ్.. నేను ఒంటరిగా తిరుగుతున్నా.. నువు నాకు బాగా గుర్తుకు వస్తావు.. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు.. నువు లేని జీవితం నాకు వ్యర్థం.. నువు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి.. నా వల్ల నువు ఎప్పుడూ ఇబ్బందులు పడవొద్దు.. దయచేసి ఆమెపై ఎలాంటి కేసులు పెట్టకండి ’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడి చేరుకొని బోరున విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.