పెళ్లికి ముందు వరకు ప్రతి యువతికి తండ్రే ప్రపంచం. కానీ పెళ్లయ్యాక అన్నీ తానై భర్త.. అండగా ఉంటాడు. ఆనందమొచ్చినా.. బాధొచ్చినా, కష్టమొచ్చినా ఆ భార్య ముందు భర్తకే చెబుతుంది. కట్టుకున్న భార్యకు ఏ చిన్న కష్టమొచ్చినా భర్తే ముందు స్పందిస్తాడు. అలా తన భార్యకు వచ్చిన కష్టంపై ఈ భర్త కూడా స్పందించాడు. పలుమార్లు మంచిగా నచ్చజెప్పాలని చూశాడు. కానీ, ఎంతకీ వినకపోవడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిని హతమార్చి.. రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా కాల్చి బూడిద చేశాడు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా కంబాలహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అశోక్ అనే వ్యక్తి భార్యను శంకర్(28) తరచుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. మొదట ఈ విషయం తెలుసుకున్న అశోక్ మంచిగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అలాంటి పనులు చేయకు.. ఆపేసేయ్ అంటూ మంచి మాటలు చెప్పిచూశాడు. కానీ, శంకర్ ఆ మాటలు వినలేదు. వేధింపులు ఆపలేదు.
చెప్పి చెప్పి విసిగిపోయిన అశోక్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మాటలతో పనికాదని శంకర్ పై ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పదునైన ఆయుధంతో శంకర్‌పై దాడి చేశాడు. అశోక్ దాడిలో శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. శంకర్ మృతదేహాన్ని ఎవరికీ తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా.. రాత్రికి రాత్రే అశోక్ కాల్చి బూడిద చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.