ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులుచేయడం లేదా తాము బలవన్మరణానికి పాల్పపడటం జరుగుతుంది.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణ సంఘటనలు చూస్తుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. మనుషుల మధ్య మానవ సంబంధాలు ఉన్నాయా? లేవా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కుటుంబ కలహాలు, ఆస్తుల గొడవలు, వివాహేతర సంబంధాలు ఇలా కారణాలు ఏవైనా మనుషులు ఒకరినొకరు అత్యంత కిరాతకంగా చంపుకుంటున్నారు. కంటికి రెప్పలా సాదుకున్న కొడుకు తండ్రిని అత్యంతా కిరాతకంగా చంపిన ఘటన జగిత్యాల జిల్లా జరిగింది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా సంగెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు రోకలి బండతో కొట్టడంతో తండ్రి అక్కడిక్కడే మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం సంగెం గ్రామంలో వల్లకొండ చిన్నయ్య.. వయసు 53 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. జీవనోపాధి కోసం 15 ఏళ్లుగా గల్ఫ్ లో ఉండి ఇటీవల స్వగ్రామం చేరుకున్నాడు. చిన్నయ్య గల్ఫ్ కి వెళ్లి సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడు భార్యతో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. ఇక భర్త బాధ భరించలేక రాజేశ్వరి సంగెంలో కాకుండా కూతురు ఇంటి వద్ద ఉంటుంది.
ఈ క్రమంలోనే తండ్రి వచ్చినప్పుడల్లా తల్లితో గొడవ పెట్టుకోవడం పెద్ద కుమారుడు పవన్ కి నచ్చేది కాదు. దీంతో తండ్రిపై కక్ష్య పెంచుకున్న పవన్ ఇద్దరు స్నేహితులతో కలిసి తండ్రిని రోకలితో కొట్టి హత్య చేశారు. తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నయ్య సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.