భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణం. పగలు రాత్రిల్లా అలా వచ్చి ఇలా పోతుంటాయి. కానీ కొందరు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా గొడవ పెట్టుకుంటున్నారు. మరి ముఖ్యంగా కట్నం విషయంలో భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. వరకట్నం వేధింపులతో అనేక మంది మహిళలు బలైన సంఘటనలు అనేకం చూశాం. అలానే ఈ వరకట్న వేధింపుల విషయంలో కొందరు.. భర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఇలా విషయం ఏదైనప్పటికి కుటుంబంలో వివాదాలు పెరుగుతున్నాయి. అలానే తాజాగా వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. భర్త పెట్టే హింసలు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన భార్యను నమ్మించి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన ఖాసింబీ, ఉమర్ సాబ్ ల కుమార్తె జాహేదా బేగం(29)ని చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన అబ్దుల్ నబీకి ఇచ్చి..2013లో వివాహం చేశారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు. పెళ్లి అనంతరం అదనపు కట్నం కోసం జాహేదా బేగంను అబ్దుల్ నబీ తరచూ వేధించేవాడు. దీంతో కూతురు బాధను చూడలేక బేగం తల్లిదండ్రులు.. హైదరాబాద్ లోని ఫాతీమానగర్ లో ఓ ఇంటిని కొనిచ్చారు. కొంతకాలం బాగా ఉన్న అబ్దుల్ నబీ.. ఆతరువాత మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భర్త సతాయింపులు తట్టుకోలేని జాహేదా తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పలుమార్లు మతపెద్దల సమక్షంలో నచ్చజెప్పినా తీరు మారలేదు.
నిత్యం తాగి వచ్చి ఆమెను హింసించే వాడు. అలానే అక్టోబరు14న కూడా మరోసారి అబ్దుల్ తాగి వచ్చి.. జాహేదా బేగంను కొట్టాడు. దీంతో ఆమె బిజినేపల్లిలోని తన పుట్టింటికి వచ్చింది. అయితే అదే నెల 18న భార్యను తన ఇంటికి పంపాలనీ నబీ.. జిబినేపల్లికి వెళ్లి అత్తింటివారితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. భార్యభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోమారు నబీ అత్తింటికి వెళ్లాడు. అక్కడ భార్య కుటుంబ సభ్యులతో నమ్మకంగా మెలిగాడు. శనివారం రాత్రి గదిలో భార్య, పిల్లలతో కలిసి నిద్రకు ఉప్రక్రమించాడు.
అర్ధరాత్రి సమయంలో వారి గది నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో తలుపులు తెరిచారు. జాహేదా రక్తపు మడుగులో పడి ఉండగా నబీ కత్తితో గొంతు కోసుకున్నాడు. వెంటనే వారిద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా జడ్చర్ల వద్ద జాహేదా మృతి చెందింది. నబీకి చికిత్స అందిస్తున్నారు. తండ్రి రాక్షసత్వంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.