విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. హాస్టల్‌లో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులను పాముకాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు, హాస్టల్ సిబ్బంది ఆ పానును అక్కడే చంపేశారు.
విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే రంజిత్ కుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాము కాటుతో విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అటు ఈ ఘటనపై విద్యార్థులను పరామర్శించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.
చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడం, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం తీవ్ర విచారకరకరమన్నారు.
విజయనగరం జిల్లా కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న 8 వ తరగతి విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.(1/3) pic.twitter.com/bh3O0HFdiJ
— Lokesh Nara (@naralokesh) March 4, 2022