పుష్ప సినిమా చూసిన వారికి పాల వ్యానులో స్మగ్లింగ్ చేసే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్‌లో పైన పాలు.. కింద ఎర్ర చందనం దుంగలు పెట్టి రవాణా చేస్తూ ఉంటారు. కానీ, తర్వాత పట్టుబడతారు.
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న కేటుగాళ్ల గుట్టు రట్టు అయింది. పుష్ప సినిమాను తలపించేలా డీసీఎంలో ప్రత్యేకంగా క్యాబిన్ ఏర్పాటు చేసి దుండగులు మద్యాన్ని తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కంటైనర్ ద్వారా మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకున్నారు. దాదాపు రూ.40 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం మేడ్చల్ సూపరింటెండ్ంట్ కార్యాలయంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌తో కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట్‌కు చెందిన ఎల్లకిన్‌రెడ్డి బాచుపల్లిలో నివాసముంటున్నాడు. గుర్గావ్ నుండి మద్యాన్ని హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో రూ.40 లక్షల విలువ చేసే మద్యం పోలీసులకు చిక్కింది. కంటైనర్, కారుతో పాటు ఏడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఎల్లకిన్ రెడ్డితో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. మరి, పుష్ప సినిమా స్టైల్లో మద్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.