Hyderabad: ప్రజలను రక్షించాల్సిన కొంతమంది రక్షక భటులే.. ప్రజల్ని కష్టాల పాలు చేసున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు ఘటన మరువకముందే ఇంకో ఘటన వెలుగుచూసింది. ఓ ఎస్‌ఐ ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. ఆమెతో సహజీవనం చేస్తూనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినా కూడా సదరు యువతితో సహజీవనం కొనసాగించాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్ విజయ్ రాచకొండ పరిధిలోని మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి మిర్యాల గూడ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న యువతితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి, విజయ్ ఆమెతో సహజీవనం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2014లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. అయితే, విజయ్ తనకు వివాహం అయినా సదరు యువతితో సహజీవనం కొనసాగించాడు. తాజాగా, వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్‌పై ఇది వరకే పలు ఆరోపణలు ఉండటంతో.. తాజా ఘటన నేపథ్యంలో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Narayanpet: ప్రేమ పంచాయితీ.. అందరిముందు పెళ్లికి నో చెప్పాడు..