ఆడవాళ్ల దుస్తులపై కామెంట్లు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఆడవారిపై అత్యాచారాలు.. దాడులు జరగటానికి వారు వేసుకునే దుస్తులే ప్రధాన కారణమని కొంతమంది బాహాటంగానే చెప్పుకొచ్చారు. అలా కామెంట్లు చేసిన వారిలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల రోడ్డుపై వెళుతున్న మహిళల దుస్తులపై కామెంట్లు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా, దుస్తులు సరిగా వేసుకోలేదన్న కారణంతో ఓ యువతిపై కొందరు యువకులు దాడి చేశారు. వందల సంఖ్యలో ఉన్న వారు ఆమెను పరుగులు పెట్టించారు. ఈ సంఘటన ఇరాక్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఇరాక్‌లో మోటార్ సైకిల్ ఈవెంట్ జరిగింది. ఓ 17 ఏళ్ల యువతి ఆ ఈవెంట్‌ను చూడటానికి వెళ్లింది.
ఆమె బ్లాక్ టాప్, స్కర్ట్ వేసుకుని ఉంది. ఈ నేపథ్యంలో ఆమె దగ్గరకి కొంతమంది యువకులు వచ్చారు. మోటార్ రైడ్ చేస్తున్న వారి దృష్టి యువతి దుస్తుల కారణంగా మరలుతోందని వారు ఆరోపించారు. ఆమెను బూతులు తిడుతూ అక్కడినుంచి పరిగెత్తించారు. కొందరు యువకులు ఆమెపై చెయ్యి కూడా చేసుకున్నారు. యువతి ఏడుస్తూ అక్కడినుంచి పరుగులు తీయసాగింది. వందల సంఖ్యలో ఉన్న యువకులు ఆమె వెంట పరిగెత్తసాగారు. గట్టిగా అరుస్తూ బూతులు తిట్టసాగారు. యువతితో పాటు వచ్చిన ఆమె స్నేహితుడిపై కూడా వారు దాడి చేశారు. ఓ వ్యక్తి కత్తితో అతడ్ని పొడిచాడు. ఈ నేపథ్యంలోనే గుంపులోని కొందరు ఆమెకు అండగా నిలిచారు. వారినుంచి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు.
బైక్ మీద ఆమెను ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ యువకుల గుంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి, దుస్తులు సరిగా వేసుకోలేదంటూ యువకులు, యువతిపై దాడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Terrifying moment hundreds of men swarm around lone girl, 17, and attack her for ‘dressing immodestly and distracting riders’ at a motorcycle event in #Iraq pic.twitter.com/1QLM98M4rM
— Patriot (@NamoTheBestPM) January 5, 2023