ఓ వ్యక్తి మద్యం అలవాటు అతడి కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. కట్టుకున్న భార్యే అతడ్ని కడతేర్చింది. తనను చిత్ర హింసలు పెడుతున్న భర్తను ఇటుకతో కొట్టి చంపింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లాకు చెందిన చిలుముల సుమన్, స్పందన భార్యాభర్తలు. వీరు రామగుండం ఎల్కల పల్లి గేటు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సుమన్ ఆటో నడుపుతూ ఉంటాడు. అయితే, ఆటో నడపటం ద్వారా వచ్చే డబ్బుల్ని అతడు మద్యం తాగటానికి ఖర్చు చేసేవాడు. ఒకరకంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగి ఇంటికి వచ్చి, భార్యను ప్రతీ రోజు హింసించటం మొదలుపెట్టాడు. ఆమెను బాగా కొట్టేవాడు. సుమన్ వేధింపులను భార్య చాలా ఓపిగ్గా భరించేది. అతడు రోజురోజుకు తన క్రూరత్వాన్ని చూపేవాడు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను విపరీతంగా కొట్టాడు. ఆమె ఏడుస్తున్నా వదల్లేదు. దారుణంగా కొట్టసాగాడు. దీంతో ఆమె సహనం కోల్పోయింది. భర్తపై తిరగబడింది. అతడిపై ఇటుకరాయితో దాడి చేసింది. తలపై విచక్షణా రహింతంగా కొట్టింది. భార్య ఇటుక దెబ్బలకు సుమన్ తల పగిలింది. రక్తం ధారపాతంగా కారింది. తీవ్ర రక్తస్రావం కారణంగా అతడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.