తెలంగాణలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఓ యువకుడు కులాంతర వివాహం చేసుకున్నాడని ప్రియురాలి ముందే ప్రియుడిని నలుగురు దుండగులు కత్తులతో నరికి చంపారు.
తెలంగాణలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. ఓ వర్గానికి చెందిన అమ్మాయిని మరో వర్గం యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిని జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు ప్రియురాలి ముందే ప్రియుడిని నలుగురు దుండగులు కత్తులతో నరికి చంపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. దూలపల్లి ప్రాంతానికి చెందిన హరీష్ అనే యువకుడు నగరంలోని ఎర్రగడ్డలో తన తల్లితో పాటు నివాసం ఉండేవాడు. గతంలో ఇక్కడుంటున్న సమయంలోనే హరీష్ కు మరో కులానికి చెందని యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ విషయం కొన్నాళ్ల తర్వాత యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో హరీష్ ను అనేకసార్లు మందలించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల కిందట హరీష్ అక్కడి నుంచి మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని దూలపల్లికి చేరుకుని అక్కడే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు.
అయితే హరీష్ మాత్ర తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఎలాగైన హరీష్ ను చంపాలని అనుకున్నారు. ఇక పథకం ప్రకారమే యువతి కుటుంబ సభ్యులు ఇటీవల దూలపల్లి ప్రాంతంలో హరీష్ అతని ప్రియురాలు వెళ్తుండగా పట్టుకున్నారు. ఆ తర్వాత నలుగురు దుండగులు ప్రియురాలు ముందే హరీష్ ను కత్తులో దారుణంగా నరికి చంపారు. అనంతరం యువతిని తమ వెంటే తీసుకెళ్లారు. దీనిని పసిగట్టిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హరీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హరీష్ ను హత్య చేశారని తెలుసుకున్న అతని తల్లి, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక మృతుడి బంధువుల సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం… హరీష్ ను యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని తేలింది. ఇటీవ చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిని హత్య చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.