ఏ సందర్భంలోనైనా.. తప్పు చేసినవారు శిక్ష అనుభవిస్తారు. అనుభవించాలి కూడా. కానీ, ఒక్క రోడ్డు ప్రమాదాల విషయంలో మాత్రం. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరో కుటుంబం అనుభవిస్తూ ఉంటుంది. బయటకి వచ్చినవారు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలి అంటే మనమే కాదు.. మిగిలిన వారు కూడా జాగ్రత్త, బాధ్యతగా ప్రవర్తిస్తేనే అది సాధ్యం అవుతుంది. అతివేగం, ఏమరుపాటు కారణం ఏదైనా… ఫలితం మాత్రం జీవితాంతం వెంటాడేది అవుతుంది.
అసలు విషయం ఏంటంటే… ఒకరి నిర్లక్ష్యం, మరొకరి అతివేగం కారణంగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేట బస్టాండ్ వద్ద ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఓ వాహనదారుడు చూసుకోకుండా సిగ్నల్ దగ్గర రోడ్డెక్కి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అతివేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడు అదుపు చేయలేక ఆ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఒకరు మృతిచెందగా… మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రోడ్డుపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి.