దేశ వ్యాప్తంగా నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది కీచకులు, క్రూరులు, మృగాళ్లు పెచ్చు మీరి విలయ తాండవం చేస్తున్నారు. ఆడవాళ్లపై దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. రోడ్డు పక్క ఓ యువతి శవం వెలుగు చూసింది. అది కూడా ఓ సూట్ కేసులో యువతి శవం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉత్తర ప్రదేశ్, మధురలోని తానా ఏరియా యమునా ఎక్స్‌ప్రెస్ వే దగ్గరలోని రోడ్డు పక్క పొదల్లో ఓ ఎర్ర సూట్ కేసు పడి ఉంది.
ఆ రోడ్డుపై వెళుతున్న చాలా మంది దాన్ని చూసి కూడా పట్టించుకోలేదు. అయితే, అటుగా వెళుతున్న కొంతమంది కూలీలు దాన్ని చూశారు. ఏదైనా వాహనం నుండి పడి ఉంటుందని వారు భావించారు. దాంట్లో ఏముందో చూడాలన్న ఆత్రుతతో దగ్గరకు వెళ్లారు. అప్పుడు వారికి దిమ్మ తిరిగే దృశ్యం కనిపించింది. సూట్ కేసు లోంచి రక్తం కారుతూ ఉంది. దాంట్లోంచి రక్తం కారటం చూడగానే వారికి భయం పట్టుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సూట్ కేసును అత్యంత జాగ్రత్తగా తెరిచారు. అందులో యువతి శవం ఉండటం చూసి షాక్ తిన్నారు. ఆ యువతి గుండెల్లో బుల్లెట్ దిగి ఉంది. శరీరంపై అక్కడక్కడా దెబ్బలు తగిలిన గుర్తులు కూడా ఉన్నాయి. ఆ యువతి వయసు 21నుంచి 22 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె టీషర్ట్, జీన్స్ పాయింట్ ధరించి ఉంది. పోలీసులు యువతి ఫొటో తీసి అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.