ప్రజల సమస్యలను సొమ్ము చేసుకుంటున్న ‘వైద్య పిశాచాలు’!…
ప్రజల బలహీనత వారి బలం!..
ఈ రోజుల్లోనూ మాయలు.. మంత్రాలు…
కోళ్లు ,కొబ్బరికాయలు, నిమ్మకాయలు…
ఇవే పెట్టుబడి…భయపెట్టీ మరీ సంపాదన!!.
సమస్యల్లో ఉన్న వారు వీరి వద్దకు వస్తే క్షుద్ర పూజలు అంటూ చేతబడి అంటూ వారిని నమ్మించి వేలకు వేలు వారి వద్దనుండి వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క భూతవైద్యుడు సంపాదన రోజుకు 70 వేలు ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పూజల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్‌కు చెందిన సదరు మహిళ తన ఇంట్లో నెలకొన్న ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాకేష్ అనే వ్యక్తిని ఆశ్రయించింది.
రాకేష్ తనకు అధిక శక్తులు ఉన్నాయని, మంత్రాలతో మహిళ సమస్యలను దూరం చేస్తానని నమ్మించాడు. దీనికోసం అమ్మవారికి పూజ చేయాలని పెద్ద మొత్తంలో ఖర్చుఅవుతుందని తెలిపాడు. పూజలు చేస్తానని చెప్పి ఆ మహిళ నుంచి 1,60,000ల నగదు, 5 తులాల బంగారాన్ని రాకేష్ తీసుకున్నాడు. పూజల గురించి ఎన్నిసార్లు అడుగుతున్నా మాటను దాటవేస్తున్నాడు. మహిళకు అనుమానం వచ్చి తాను ఇచ్చిన నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలని వేడుకుంది. మోసగాడు బాధిత మహిళను అసభ్య పదజాలంతో దూషించి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు.
బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి నెరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకుని పలుసెక్షన్‌ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో రాకేష్ ఇప్పటికే మరో 5 గురిని కూడా మోసం చేసినట్లు గుర్తించారు.