క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కుటుంబ కలహాలతో విసుగెత్తిపోయి ప్రాణాలను తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న చిన్న చిన్న గొడవలు పెను విషాదానికి దారితీస్తున్నాయి.
కొందరు వ్యక్తులు మానవత్వాన్ని మరిచి మృగాళ్లుగా మారి హత్యలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓ అల్లుడు అత్తమామలపై దాడికి పాల్పడ్డాడు. ఆ విషయంలో తనకు అడ్డొస్తున్నారని కక్షపెంచుకుని అతికిరాతకంగా అత్తను హత్య చేశాడు. మామను కూడా చంపబోతుంటే తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషాద ఘటన ఎపిలోని విజయవాడలో చోటు చేసుకుంది. అగ్ని సాక్షిగా వివాహమాడిన భర్త కుటుంబ బాధ్యత మరిచి చెడు అలవాట్లకు బానిసై నిత్య నరకం చూపిస్తున్నాడు. తన ఆగడాలను తట్టుకోలేక ఆ వివాహిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఏడాది క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.
ఇక ఈ విషయంపై కక్ష పెంచుకున్న భర్త ఆమె తల్లిదండ్రులపై అత్యంత పాశవికంగా దాడిచేశాడు. ఆ ఘటనలో ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని వైఎస్ ఆర్ కాలనీలో గోగుల గురుస్వామి, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వారిలో రెండవ కుమార్తె లలితకు ఏకలవ్యనగర్ కు చెందిన కుంబా రాజేష్ తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ బాధ్యత మరిచిన రాజేష్ క్రికెట్ బెట్టింగులు, పేకాట ఆడుతూ ఉన్నదంతా పోగొట్టాడు. పనిపాట లేకుండా తిరుగుతూ లలితను వేధించేవాడు. భర్త ఆగడాలను భరించలేక లలిత పుట్టింటికి చేరింది.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. తన భార్యను కాపురానికి పంపకుండా విడాకులు ఇచ్చేందుకు ఆమెకు మద్దతిస్తున్నారని అత్తమామలపై అల్లుడు రాజేష్ కక్షపెంచుకున్నాడు. అత్తమామలను అంతమొందించాలని పథకం రచించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి గురుస్వామి నాగమణిలు తమ పెద్ద కూతురు వద్దకు వెళ్లేందుకు బైక్ పై బయలుదేరారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన అల్లుడు రాజేశ్ చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై బైక్ పై వారు వస్తుండగా తన వద్ద ఉన్న కొబ్బరి బొండాల కత్తితో అత్త చేయిని నరికాడు. దీంతో ఆమె బైక్ నుంచి కింద పడిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమె మెడను నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
మామ గురుస్వామిని చంపబోతుంటే అతడు తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటన అనంతరం రాజేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీస్ స్టేషన్ సిఐ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు కొత్తపేట పోలీస్ స్టేషన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాజేష్ భార్య లలిత తన తల్లిని చంపిన తన భర్తను చంపేయండి అంటూ వేడుకుంటుంది. నా జీవితం అంతా వాడికి ఊడిగం చేశానని, ఇప్పుడు తన తల్లిని దూరం చేశాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.