గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం.. అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. మహారాష్ట్ర సోలాపుర్లోని డిండిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం కోసం పంఢర్పుర్కు భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ లో దాదాపు నలభై మందికి పైగానే ఉన్నారు.
ఇది చదవండి : వీధి కుక్క నోట్లో శిశువు తల.. షాక్ అయిన జనం..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులు తుల్జాపుర్ తాలుకాలోని కడంవాడి నివాసితులుగా గుర్తించారు. భక్తులంతా ఏకాదశి సందర్భంగా ట్రాక్టర్లో పంఢరపుర్కు బయలుదేరారు. విఠలేశ్వరుడి ఆలయంలో ఏకాదశి పర్వదిన్నాన్ని నిర్వహించేందుకు సోలాపుర్ నుంచి మోహుల్ మీదుగా పంఢర్పుర్కు వెళ్తుండగా కొండి-కేగావ్ మధ్య ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.